: కుంబ్లే ఎలా ఉండేవాడు?... కోహ్లీ టీములో ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తున్న బీసీసీఐ!

భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు ఏర్పడిన వేళ, కుంబ్లేను తొలగిస్తారని వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి కోహ్లీ టీమ్ సభ్యులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ప్రతి ఆటగాడితో మాట్లాడుతున్న ఆయన, డ్రస్సింగ్ రూములో కుంబ్లే వ్యవహార శైలిపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం వెలువడకపోయినా, అసలు టీముతో కుంబ్లేకు విభేదాలు ఎక్కడ మొదలయ్యాయన్న విషయంపైనే ఆయన ప్రధానంగా దృష్టిని సారించినట్టు తెలుస్తోంది.

కాగా, కోహ్లీకి, కుంబ్లేకు మధ్య ఎలాంటి గొడవలూ లేవని చెప్పిన అమితాబ్ చౌదరి, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తరువాత సంస్థాగత మార్పులు ఉండే అవకాశాలు ఉండవచ్చని అన్నారు. కుంబ్లే పనితీరుపై తనకెలాంటి సందేహాలు లేవని చెబుతూనే, ఆయన కాంట్రాక్టును పొడిగించాలా? వద్దా? అన్న విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే టీమిండియాకు కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకు భారత బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగత్ తో పాటు, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, రిచర్డ్ పైబుల్ లు దరఖాస్తు చేసుకున్నారు.

More Telugu News