: గుంగూలీ! నువ్వీ పందానికి సిద్ధమా?: సవాలు విసిరిన షేన్ వార్న్, మైఖేల్ క్లార్క్

ఇంగ్లండ్ లోని ఓవల్ లో మరికొన్ని గంటల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వివిధ టీవీ ఛానెళ్లతో ఒప్పందం చేసుకున్న ఐసీసీ దిగ్గజ మాజీలను వ్యాఖ్యాతలుగా రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం గంగూలీ, ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ సరదాగా పందెంకాసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో వీరిద్దర్నీ టోర్నీలో ఫైనల్స్ ఏ జట్ల మధ్య జరుగుతుంది అని వ్యాఖ్యాత (యాంకర్) ప్రశ్నించగా, గంగూలీ మరో అవకాశం లేకుండా భారత్-ఇంగ్లండ్ జట్లని అన్నాడు. దానికి మైఖేల్ క్లార్క్, షేన్ వార్న్ విభేదించారు. ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరుగుతుందని తాను భావిస్తున్నానని మైఖేల్ క్లార్క్ పేర్కొనగా, గంగూలీ సమాధానంతో నొచ్చుకున్న షేన్ వార్న్ ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతుందని అన్నాడు. దానిని గంగూలీ ఖండించాడు. వెంటనే ఇంగ్లండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారని వార్న్ ప్రశ్నించాడు.

 వెంటనే జోరూట్, బట్లర్ అని గంగూలీ సమాధానమిచ్చాడు. అంతే కాకుండా ఏ విభాగంలో చూసినా ఆసీస్ కంటే ఇంగ్లండ్ బలంగా ఉందని చెప్పాడు. అందుకే తాను ఫైనల్ లో టీమిండియాతో ఇంగ్లిష్ జట్టు తలపడుతుందని చెప్పానని అన్నాడు. దీంతో జూన్‌ 10న ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న మ్యాచ్‌ లో స్మిత్‌ సేన విజయం సాధిస్తే నవ్వు ఆసీస్‌ జెర్సీ ధరించాలి, అలాగే డిన్నర్‌ పార్టీ కూడా ఇవ్వాలి, అందుకు నువ్వు సిద్ధమా? పందానికి రెడీయా? అని వార్న్ కవ్వించాడు. అదే మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ గెలిస్తే తామిద్దరం ఇంగ్లాండ్‌ జెర్సీ ధరిస్తామని వార్న్‌ చెప్పాడు. దీంతో గంగూలీ సరే అన్నాడు. కాగా, భారత్, పాకిస్థాన్ తరహాలో క్రికెట్ లో ఇంగ్లండ్, ఆసీస్ కూడా బద్ధశత్రువులన్న సంగతి తెలిసిందే.

More Telugu News