: చెన్నై సిల్క్స్ భవనంలో మంటలు... కాలి బూడిదైన వస్త్రదుకాణం!

చెన్నైలోని టీ.నగర్‌ లో ప్రముఖ వస్త్ర, బంగారు నగల దుకాణాల సముదాయం చెన్నై సిల్క్స్‌ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించగా, సాయంత్రం వరకు ఎగసిపడ్డ అగ్ని కీలలు ఆ షాపింగ్ మాల్ ను బూడిద చేశాయి. ఏడంతస్తుల షాపింగ్ మాల్ లో కింది నుంచి పై వరకు అన్ని అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద హెచ్చరికలు అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు.

ఈ సమయంలో 2, 3, 7 అంతస్తుల్లో సిబ్బంది చిక్కుకున్నారని గుర్తించి, స్కై లిఫ్టులు ఉపయోగించి వారిని ప్రాణాలతో కాపాడారు. మొత్తం 12 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారని, ప్రాణభయంతో కేకలు వేయడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. అలాగే 150 వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దించి సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిని పూర్తిగా లెక్కించాల్సి ఉంది. నగలు, నగదు ఇతర సామగ్రి వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని అంతస్తుల్లోని వస్త్రాలు పూర్తిగా కాలిపోయాయని ఈ షాపు యాజమాన్యం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు.

More Telugu News