: వీలునామా లేకుండా.. కూతురి ఫేస్‌బుక్‌ అకౌంట్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రులకు కూడా హక్కులేదు: కోర్టు తీర్పు

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ప్రజలు అధికంగానే వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్ట‌ర్ అంటూ ఇలా ఎన్నో యాప్‌లలో త‌మకు సంబంధించిన ఫొటోలను, త‌మ‌ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఒక‌వేళ సోష‌ల్ మీడియా అకౌంట్ యూజర్లు చనిపోతే? ఇక ఆ అకౌంట్ ‌ను ఇత‌రులు ఉప‌యోగించ‌వ‌చ్చా? ఆ యూజ‌ర్‌ అంత‌కు ముందు వీలునామా రాసి ఉంచితే ఉప‌యోగించవ‌చ్చు. ఈ విష‌యం ఎంతో మందికి తెలియ‌దు. కొన్ని సామాజిక మాధ్యమాలు వీలునామాలకు అనుమతి ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ కేసులో జ‌ర్మ‌నీలోని ఓ కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

చనిపోయిన టీనేజ్ అమ్మాయి సోష‌ల్ మీడియా ఖాతాల‌ను వాడటానికి వీలులేద‌ని, ఈ విష‌యంలో ఆమె తల్లిదండ్రులకు కూడా ఎలాంటి హక్కులేదని తెలిపింది. వివ‌రాల్లోకి వెళితే, 2012లో రైలు ప్రమాదంలో త‌మ‌ 15 ఏళ్ల కూతురిని కోల్పోయిన ఓ దంప‌తులు ఆమె ఆత్మహత్య చేసుకుందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె సోష‌ల్ మీడియాను చెక్ చేస్తే అందుకు దారితీసిన విష‌యాలేమైనా తెలుస్తాయ‌ని అనుకుంటున్నారు. త‌మ‌ కూతురు చాట్ మెసేజ్ లను, పోస్టులను తెలుసుకోవడం కోసం యాక్సస్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, టీనేజర్ల కాంట్రాక్ట్ ల ప్రైవసీ విషయంలో తాము రాజీపడబోమని ఫేస్‌బుక్‌ తేల్చి చెబుతోంది. ఈ విషయంలో కోర్టు కూడా ఫేస్‌బుక్‌కు అనుకూలంగానే తీర్పునిచ్చింది.

More Telugu News