: 'బీర్'బల్స్ కోసం ఏకంగా పైప్ లైన్ వేస్తున్నారు!

మీరు చదివింది నిజమే.. బీరు ప్రియుల కోసం ఏకంగా పైప్ లైనే వేస్తున్నారు. అయితే, ఇది మన దేశంలో కాదు జర్మనీలో. అక్కడి వాకెన్ పట్టణంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఇందులో స్థానికులతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా పాల్గొంటారు. ఈ వేడుకలో బీరు సేవించడం కూడా ఓ భాగమే. అయితే బీరు తాగి, ఖాళీ గ్లాసులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని పచ్చని పొలాలు పాడైపోతున్నాయట.

ఈ నేపథ్యంలో, వేడుక నిర్వాహకులు బాగా ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చారు. గ్లాసులు, సీసాలను అనుమతించకుండా, పైపుల ద్వారా బీరును సరఫరా చేయాలని వారు నిర్ణయించారు. ఇలా చేస్తే.. వ్యర్థాలు తగ్గుతాయని, పొలాలకు హాని కలగకుండా ఉంటుందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో, పట్టణం నుంచి పొలాల్లోకి ఆరున్నర కిలోమీటర్ల మేర భూగర్భ పైప్ లైన్ వేస్తున్నారు. ఈ పైప్ లైన్ ద్వారా వేడుక జరిగే ప్రాంతానికి బీరు పంపిణీ చేయనున్నారు. పైపు నుంచి వచ్చే బీరును వేడుకలో పాల్గొనేవారు పట్టుకొని తాగేయచ్చన్నమాట. ఈ సందర్భంగా ఒక్కొక్కరు 5 లీటర్ల వరకు బీరు తాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 5వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుక జరగనుంది.

More Telugu News