: నీ తెలివి తెల్లారినట్టే ఉంది.. స్కూలు పిల్లాడికి కూడా నీ కంటే ఎక్కువ తెలిసి ఉంటుంది.. అర్ణాబ్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ!

ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ అధినేత అయిన అర్ణాబ్ గోస్వామిపై కేరళకు చెందిన సీపీఎం ఎంపీ ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ణాబ్ చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమం అనంతరం ఫేస్‌బుక్ పేజీలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పాలక్కడ్‌కు చెందిన ఎంపీ ఎంబీ రాజేష్ తన ఫేస్‌బుక్ పేజీలో అర్ణాబ్ గురించి రాస్తూ జర్నలిస్ట్ నుంచి ఏమైతే ఆశిస్తామో అవి అర్ణాబ్‌లో లేవని వ్యాఖ్యానించారు. సమగ్రత, సమతూకం, విశ్వసనీయత ఆయనలో ఇసుమంతైనా కనిపించలేదని దుమ్మెత్తి పోశారు. అర్ణాబ్‌ను పిరికివాడైన అనైతిక జర్నలిస్టుగా అభివర్ణించారు. ఇటువంటి న్యూస్ యాంకర్‌ను తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

మోదీ మూడేళ్ల  పాలనపై మే 26న నిర్వహించిన చర్చ కోసం రిపబ్లిక్ టీవీ నుంచి ఎంపీ రాజేశ్‌కు పిలుపు వచ్చింది. అయితే ఆ తర్వాత చర్చ పక్కదారి పట్టింది. కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ ఆర్మీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ దారి మళ్లింది. దీంతో రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్చను బాయ్‌కాట్ చేస్తూ బయటకు వచ్చేశారు.

తాజాగా ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో ఆనాటి ఘటనను వివరిస్తూ అర్ణాబ్‌పై విరుచుకుపడ్డారు. సీపీఎంపై అర్ణాబ్ చేస్తున్న ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి తెలిసినంత చరిత్ర కూడా అర్ణాబ్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. అతడికి తెలిసిన చరిత్రను చూసి ఆయనకు చదువు చెప్పిన హిస్టరీ టీచర్ తలవంచుకుంటారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఆ తర్వాత ఆర్మీపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆయన చేసిన పోస్టింగ్‌ను 6 వేల మంది షేర్ చేశారు. అంతేకాదు దానికి మలయాళం అనువాదాన్ని కూడా నెటిజన్లు అడుగుతుండడం గమనార్హం. కాగా, టైమ్స్ నౌ చానల్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించిన అర్ణాబ్ అందులోంచి బయటకు వచ్చి ఇటీవల రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. ఆ చానల్ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాస్పద  ప్రసారాలతో వార్తల్లో నిలుస్తోంది.

More Telugu News