: బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ లో జరుగుతున్న రెండో సన్నాహక మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు భారత్‌ ను బ్యాటింగ్‌ కు ఆహ్వానించింది. రెండో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ రోహిత్‌ (1) అవుటై నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (60) రాణించాడు. తొలి వార్మప్ మ్యాచ్ లో విఫలమై విమర్శలపాలైన దినేశ్‌ కార్తీక్‌ (94 రిటైర్డ్‌) ధాటిగా ఆడాడు. హార్దిక్‌ పాండ్యా (80 నాటౌట్‌) ఆకట్టుకోగా, కేదార్‌ జాదవ్‌ (31), రవీంద్ర జడేజా (32)లు ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 324 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించారు. కేవలం 22 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టును టెయిలెండర్లు ఆదుకున్నారు. దీంతో 23.5 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో మూడేసి వికెట్లతో భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌ రాణించగా, మహ్మద్‌ షమీ, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ తలో వికెట్‌ తీసి బంగ్లా ఇన్నింగ్స్ కు ముగింపు పలికారు. పెద్ద జట్లపై విజయం సాధించి ఆత్మవిశ్వాసం పెంచుకున్న బంగ్లాదేశ్ జట్టును ఏమాత్రం లెక్కచేయకుండా 240 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా ఆ జట్టును మరోసారి పసికూనను చేసింది. 

More Telugu News