: అనిల్ కుంబ్లేపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి!

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేపై జట్టు సభ్యుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. కుంబ్లేపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరి కొందరు సీనియర్ ప్లేయర్లు గుర్రుగా ఉన్నారట. ఈ విషయాన్ని కోహ్లీకి అత్యంత దగ్గరైన ఓ వ్యక్తి తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గా కుంబ్లే పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. వాస్తవానికి హెడ్ కోచ్ గా కుంబ్లేను కొనసాగించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నప్పటికీ... కోహ్లీ అందుకు నిరాకరించినట్టు సమాచారం.

టీమ్ ను కుంబ్లే హ్యాండిల్ చేస్తున్న పద్ధతిపై కోహ్లీతోపాటు, సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. కుంబ్లే వర్కింగ్ స్టైల్ కంటే రవిశాస్త్రి వర్కింగ్ స్టైల్ పట్లే వీరు మొగ్గుచూపుతున్నారట. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను శాంతింపజేసేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లు రంగంలోకి దిగారట. అయితే, ఈ సమస్య ఇప్పటి వరకైతే ఇంకా ముదరలేదు. దీంతో, సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు హెడ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యత సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లపైనే ఉంది. వ్యక్తిగతంగా వీరంతా రవిశాస్త్రికి సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, కొత్త హెడ్ కోచ్ ఎంపిక అంశం ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 

More Telugu News