: లాడెన్ ను చంపిన రాత్రి ఏం జరిగిందంటే...!: గతాన్ని గుర్తు చేసుకున్న ఒసామా బిన్ లాడెన్ భార్య

అమెరికాను గడగడలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ ను ఎలా మట్టుబెట్టిందీ ఆ ఆపరేషన్ లో పాల్గొన్న అమెరికా సీల్స్ ఇప్పటికే ప్రపంచానికి వివరించారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఒసామా బిన్ లాడెన్ తరపున ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా, లాడెన్ ను అమెరికన్ సీల్స్ హతమార్చినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతని నాలుగో భార్య అమల్‌ గతాన్ని గుర్తుచేసుకున్నారు. లాడెన్ ను సీల్స్ వేటాడిన రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్‌-క్లార్క్‌, అడ్రియాన్‌ లెవీ అనే ఇద్దరికి వివరించింది. ఆ ఇద్దరూ లాడెన్‌ ను హతమార్చిన రోజు ఏం జరిగింది, లాడెన్ ఎలా హతమయ్యాడు, చివరి క్షణాలలో లాడెన్ భావోద్వేగాలు ఏంటి? అనే వివరాలు తెలుపుతూ "ది ఎక్సైల్‌: ది ఫైట్‌ ఆఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌" పేరిట ఒక పుస్తకం రాస్తున్నారు.

 దీనికి సంబంధించి వారు సేకరించిన వివరాలను బ్రిటన్‌ లోని సండే టైమ్స్‌ తో పాటు ఒక టీవీ ఛానెల్‌ లో ప్రసారమయ్యాయి. వాటి వివరాల్లోకి వెళ్తే.... 'పాకిస్థాన్ లోని అబోటో బాద్ లోని ఆర్మీ స్థావరం పక్కనున్న బిల్డింగ్ లో అప్పటికి ఆరేళ్లుగా మేం తలదాచుకుంటున్నాం. మా ఇంటి ఆవరణలో ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ ల్యాండ్ అయింది. అర్థరాత్రి చిమ్మచీకట్లో హెలికాప్టర్‌ శబ్దం విని మేల్కొన్న నా భర్త లాడెన్‌ ముఖంలో చాలా భయం చూశాను. అమెరికన్‌ సీల్స్‌ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు (లాడెన్‌ ఇతర భార్యలు) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న అప్‌ స్టెయిర్స్‌ కు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు.

 దీంతో వెంటనే లాడెన్ అప్రమత్తమై, వారికి కావాల్సింది నేను మాత్రమేనని, మీతో వారికి ఎలాంటి ఉపయోగం లేదు కనుక నా దగ్గర మీరెవరూ ఉండొద్దు, మీరంతా కిందికి వెళ్లిపోండి.. అని సూచించారు. దీంతో వారంతా అక్కడి నుంచి కదిలారు. నేను మాత్రం నా కొడుకు హుస్సేన్ తో కలిసి ఉండాలని నిర్ణయించుకుని అక్కడే ఉన్నాను. ఇంతలో అమెరికన్ సీల్స్ లాడెన్ కొడుకుల్లో ఒకడైన ఖలీద్ ను చంపేసి, ఇతర పిల్లలతో గొడవపడుతూ వస్తున్నారు. వారు లాడెన్ గదికి చేరుకోగానే...వారికి ఎదురెళ్లిన నేను వారిని తోసేసేందుకు ప్రయత్నించాను. అంతలో వారు ఫైరింగ్‌ స్టార్ట్‌ చేశారు.

దీంతో ఒక బుల్లెట్ నా కాలుకి తగిలింది. నేను పడిపోయాను. ఇంతలో సీల్స్ లాడెన్ ను మట్టుబెట్టేశారు. దానిని నేను, నా కొడుకు హుస్సేన్ కళ్లారా చూశాము. దానిని చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను’ అంటూ ఆమె వారికి వివరించింది. తమకు తెలిసినవారే లాడెన్ కు సంబంధించిన సమాచారం అమెరికా నిఘా వర్గాలకు అందించాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆరేళ్లు నివసించిన ఇల్లే తమకు మృత్యుకుహరమవుతుందని తాము కలలో కూడా ఊహించలేదని, పటిష్ఠ భద్రతమధ్యే ఉన్నామని భావించామని ఆమె తెలిపిందని ఆ పుస్తక రచయితలు తెలిపారు.

More Telugu News