: 'పతంజలి'లో కల్తీ.... ఆర్మీ క్యాంటీన్లో విక్రయం నిషేధం!

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి తయారు చేసే ‘దివ్య ఆమ్ల జ్యూస్, శివ్‌ లింగి బీజ్‌’ కల్తీవని తేలింది. పతంజలికి చెందిన ఈ పదార్థాలపై హరిద్వార్ ఆయుర్వేద, యునానీ క్వాలిటీ చెకింగ్ ల్యాబ్ నిర్వహించిన క్వాలిటీ టెస్ట్‌ లో ఫెయిలయ్యాయి. 2013-16 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 82 ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించగా, అందులో వివిధ కంపెనీలకు చెందిన 40 శాతం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్‌లో కల్తీ జరుగుతోందని ఆ ల్యాబ్ తేల్చిచెప్పింది. తాము పరీక్షించిన 82 ప్రోడక్ట్స్ లో 32 పొడక్ట్స్ క్వాలిటీ చెకింగ్‌ లో ఫెయిల్ అయ్యాయని తెలిపారు.

ఫెయిల్ అయిన ప్రోడక్ట్స్ లో రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయని వారు చెప్పారు. స్వదేశీ నినాదంతో హోరెత్తించే పతంజలికి చెందిన శివ్‌ లింగి బీజ్‌ లో 31.68 శాతం విదేశీ పదార్థాలే ఉన్నాయని విశ్లేషకులు గుర్తించారు. అంతే కాకుండా వివిధ రాష్ట్రాల్లో తాము పండించి సరఫరా చేస్తున్నామని చెప్పే ఆమ్ల జ్యూస్‌ లో ఆల్కహాల్ పిహెచ్ విలువ ఉండాల్సినదాని కన్నా తక్కువగా ఉందని తెలిపారు. ఆమ్ల జ్యూస్‌ లో పిహెచ్ విలువ సాధారణం కన్నా తక్కువగా అంటే 7 కంటే తక్కువగా ఉన్నట్లయితే అసిడిటీ, ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని క్వాలిటీ చెకింగ్ అధికారులు తెలిపారు.

ఆరోగ్యం కోసం పతంజలి ఆమ్లా జ్యూస్ తీసుకుంటే... అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. కేవలం హరిద్వార్ ల్యాబ్ మాత్రమే కాకుండా, ఇటీవల పశ్చిమ బెంగాల్ పబ్లిక్ హెల్త్ లాబోరేటరీ నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో కూడా పతంజలి ప్రొడక్ట్స్‌ ఫెయిలయ్యాయని తేలింది. దీంతో సైనిక బలగాల క్యాంటీన్ స్టోర్స్ విభాగం (సీఎస్‌డి) పతంజలికి చెందిన ఆమ్ల జ్యూస్‌ ను అమ్మడాన్ని నిషేధించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం కూడా దీనిని నిర్ధారించగా, పతంజలి సంస్థ మాత్రం దీనిని కొట్టిపడేస్తోంది.

More Telugu News