: నో డిలే.. అనుకున్నట్టే నేడు కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు.. మండే ఎండలకు నేటితో చెక్!

నైరుతి రుతుపవనాలు చల్లని కబురు మోసుకొస్తున్నాయి. అనుకున్నట్టుగానే నేడు (మంగళవారం) కేరళ తీరాన్ని తాకనున్నాయి. అలాగే ఈశాన్య భారతదేశంలోనూ ప్రవేశించనున్నాయి. అనంతరం దేశమంతా విస్తరిస్తాయి. ఈ నెల 30న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావరణశాఖ అధికారులు ఈనెల మొదట్లోనే తెలిపారు. రుతుపవనాల ప్రవేశంతో వచ్చే 24 గంటల్లో కేరళతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. రుతుపవనాల ప్రవేశంతో భానుడి ప్రతాపానికి చెక్ పడనుంది.

 కేరళలో రుతుపవనాల ప్రవేశం తర్వాత కొన్ని రోజులకు ఈశాన్య భారతంలో వర్షాలు పడనుండగా ప్రస్తుతం రుతుపవనాలకు ‘మోరా’ తుపాను జతకలిసింది. ప్రస్తుతం తుపాను బంగాళాఖాతంలో ఉత్తర దిశ నుంచి నెమ్మదిగా కదులుతోంది. దీని ప్రభావంతో రేపు మధ్యాహ్నం నుంచి తూర్పు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను కారణంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర, ఈశాన్య భారతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.

More Telugu News