: మూడేళ్లలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం: అమిత్ షా

గడచిన మూడేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్న సబ్సిడీని డైరెక్టుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల కేంద్ర ఖజానాకు రూ. 50 వేల కోట్లు మిగిలిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. 32 కోట్ల మందికి నగదును వారి బ్యాంకు ఖాతాల్లోకి వేస్తున్నామని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ తెలిపారు. పేదలకు అందాల్సిన నిధుల్లో లీకేజీలను నివారించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, ఆ దిశగా సత్ఫలితాలను సాధిస్తున్నామని, మధ్యవర్తుల ప్రోద్బలాన్ని పూర్తిగా తగ్గించామని, అక్రమ లబ్ధిదారులనూ తొలగిస్తూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లలో 20 శాతం వృద్ధి రేటు కనిపించిందని, స్వతంత్ర భారతావనిలో పన్ను వసూళ్లు ఇంతగా పెరగడం ఇదే తొలిసారని చెప్పారు.

ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధిని నమోదు చేస్తున్న దేశాల్లో ఒకటైన భారతావనిలో వృద్ధి వేగాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యూరియా ఉత్పత్తిని పెంచామని, అత్యధికులకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి విభాగాల్లో రికార్డు స్థాయి ప్రొడక్షన్ నమోదైందని, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల విషయంలో ఎన్నడూ లేనంత పురోగతిని సాధించామని ఆయన తెలిపారు. వీటి ప్రభావంతోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించిందని, తదుపరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

More Telugu News