: ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం

రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్నో హామీలు గుప్పించి, ఓట్లు వేయించుకొని ఆ త‌రువాత ఇచ్చిన హామీల‌ను మ‌ర్చిపోతున్నాయ‌ని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పార్టీలు త‌మ‌ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు చిత్తుకాగితాలుగా మారుతున్నాయ‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.ఎస్ ఖేహర్ ఆమధ్య చేసిన వ్యాఖ్యలను లేఖ‌లో ప్ర‌స్తావించిన ముద్ర‌గ‌డ.. ఆ వ్యాఖ్య‌లు అక్షర సత్యాలని అన్నారు. ఇచ్చిన‌ హామీలను నెరవేర్చాల‌ని ఎవ‌ర‌యినా అడిగితే, పోలీసులతో ఆందోళ‌న‌కారుల‌ను కొట్టించడం, తిట్టించడం, అక్రమ కేసులు పెట్టించడం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

రాజ‌కీయ నాయ‌కులు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ముద్రగడ అన్నారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసేవారు, లిక్కరు పంచేవారు మాత్ర‌మే ఎన్నికల్లో పోటీ చేయాలనేలా రాజ‌కీయాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బు లేని వారు ఎన్నిక‌ల్లో పోటీచేయలేని పరిస్థితి నెలకొందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే రెండు సంవత్సరాల్లోపే త‌ప్ప‌నిస‌రిగా అమలు చేయాలనే నిబంధన విధిస్తే బాగుంటుంద‌ని ఆయ‌న అన్నారు.                    

More Telugu News