: భిన్నత్వంలో ఏకత్వం - అదే భారత బలం!: 32వ 'మన్ కీ బాత్'లో మోదీ

భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించడమే భారత సార్వభౌమాధికారానికి శ్రీరామరక్షని, అదే దేశాభివృద్ధికి కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో ద్వారా తన 32వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వినిపించారు. నేటి నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో ఏదైనా కొత్త విషయాన్ని కనుగొని, ఆ అనుభవాన్ని తనకు తెలియజేయాలని పిలుపునిస్తే, ఎంతో మంది యువత స్పందించారని, వారి వినూత్నతకు తాను పులకించిపోయానని అన్నారు. ఇండియాలోని 125 కోట్ల మంది ప్రజల్లోని మత సామరస్యం ప్రపంచానికే ఆదర్శమని, శాంతి, ఏక్తా, సద్భావన మూల స్తంభాలుగా ఇండియా ముందుకు దూసుకెళుతోందని తెలిపారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామ పోరును తానెన్నడూ మరచిపోబోనని, వీర సావర్కార్ రచించిన 'మాజీ జన్మతీప్' తనకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అండమాన్ కాలాపానీ జైల్లో ఆయన ఈ పుస్తకాన్ని రాశారని చెబుతూ, సావర్కార్ జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడూ ఒక్కసారి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు.

More Telugu News