: అబ్బే.. దానికేమంత ప్రాధాన్యం లేదు.. పీఎం-సీఎం మీటింగ్ అంతే..: తేల్చి చెప్పిన నితిశ్ కుమార్

సోనియాగాంధీ ఇచ్చిన విందుకు గైర్హాజరైన బీహార్ ముఖ్యమంత్రి  నితిశ్ కుమార్ శనివారం ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన విందుకు హాజరు కావడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశం బీజేపీ-జేడీయూ భవిష్యత్ రాజకీయాలకు సంకేతమని భావిస్తుండగా, అటువంటిదేమీ లేదని నితిశ్ కొట్టిపారేశారు. ఇది కేవలం ప్రధాని-ముఖ్యమంత్రి సాధారణ భేటీ అని, దీనికేమంత ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. జేడీయూ చీఫ్‌గా తాను ప్రధానిని కలవలేదని, ఓ ముఖ్యమంత్రిగానే ఆయనను కలిశానని స్పష్టం చేశారు. దీనిని మీడియా అనవసరంగా పెద్దది చేసి చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించిన సీఎం.. నిజాలు తెలిశాకే ఈ విషయంలో స్పందిస్తానన్నారు. మారిషస్  ప్రధాని ప్రవింద్ జుగ్‌నౌత్ గౌరవార్థం ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు నితిశ్ కుమార్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నితిశ్ మాట్లాడుతూ మారిషస్‌తో బిహార్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. మారిషస్ ప్రజల్లో సగం మంది బీహార్ మూలాలున్నవారేనని అన్నారు. ముఖ్యమంత్రిని కాబట్టే మోదీ తనను ఆహ్వానించారని, దానికి తాను సమ్మతించానని నితిశ్ పేర్కొన్నారు.

More Telugu News