: నరేష్ ను ఇలా... చంపేశారు!: భువనగిరి విషాదాంత ప్రేమకథ గురించి పోలీసులు

భువనగిరి జిల్లాకు చెందిన నరేష్, స్వాతి ప్రేమకథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఎదుర్కొన సవాళ్లు, కేసును ఛేదించిన విధానాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విచారణలో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. రకరకాల కథలు, కథనాలు చెబుతూ తమను అనుక్షణం తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడని, చివరికి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా రాచకొండ కమీషనర్, డీసీపీ ఈ కేసు వివరాలను వెల్లడించారు.  

"ఏప్రిల్ 24న పారిపోయి, 25న ముంబైలో స్వాతి, నరేష్ రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నారు. దీనిని ట్రేస్ చేసిన శ్రీనివాస్ రెడ్డి, నరేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, పంచాయతీ ఏర్పాటు చేసి, కుమార్తెను వెనక్కి రప్పించుకున్నాడు. అనంతరం అదే నెల 31న మళ్లీ స్వాతి ఒక్కర్తే ముంబైలోని నరేష్ దగ్గరకు వెళ్లిపోవడంతో వివాదం రేగింది. గతంలో నరేష్ కుటుంబంతో ఉన్న పరిచయం నేపథ్యంలో వారి కుటుంబంలోని వారితో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడేవాడు.

ఈ క్రమంలో ముంబై వెళ్లిపోయిన స్వాతిని కాంటాక్ట్ చేశాడు. ఆ తరువాత వారిద్దరూ తరచు మాట్లాడుకునే వారు. దీంతో స్వాతి తండ్రిని తన మొబైల్ ఫోన్ రీఛార్జ్ చెయ్యమని కోరేది. దీంతో రీఛార్జ్ చెయ్యడం ఎందుకు? ఇక్కడికి వచ్చేయండి, నేను పెళ్లి చేస్తాను... ఎవరికీ చెప్పకండి అని శ్రీనివాస్ రెడ్డి వారికి చెప్పడంతో.... వారిద్దరూ దానిని నమ్మి మే 1న ఎవరికీ చెప్పకుండా భువనగిరి వచ్చారు. భువనగిరిలో బస్సు దిగిన నరేష్ ముందే వెళ్లిపోగా, అక్కడి నుంచి స్వాతిని శ్రీనివాస్ రెడ్డి, అతని మేనల్లుడు సత్తిరెడ్డికి చెందిన వేగనార్ కారులో లింగరాజుపల్లిలోని ఇంటికి తీసుకెళ్లారు.

అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో నరేష్ తండ్రి వెంకటయ్య తన కుమారుడు కనిపించడం లేదని చెబుతూ పోలీసులకు ఈనెల 2వ తేదీన ఫిర్యాదు చేశారు. దీనిపై వారు శ్రీనివాస్ రెడ్డిని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఆచూకీ లేకపోవడంతో, ఈ నెల 6న భువనగిరిలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం 16న స్వాతి సూసైడ్ చేసుకుంది. తరువాత 18న నరేష్ తండ్రి వెంకటయ్య హైకోర్టులో తన కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని చెబుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ను ఎల్బీనగర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావుకు రాచకొండ సీపీ అప్పగించారు. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఐదు టీమ్ లను ఏర్పాటు చేసి, 24న ముంబై, సోలా పూర్, పల్లెర్ల, లింగరాజు పల్లికి పంపించడం జరిగింది. ఈ కేసులో ఏ చిన్న ఆధారం వదలకుండా దర్యాప్తు చేశాం. అనంతరం ఇంటరాగేషన్ చేశాం. ఈ నెల 1న నరేష్, స్వాతితో కలిసి ముంబై నుంచి భువనగిరికి వచ్చారు. నరేష్ సత్యం హాస్పిటల్ వద్ద బస్సు దిగగా, స్వాతి అక్కడకి దగ్గర్లోనే ఉన్న తన తండ్రి సోదరి కుమారుడు సత్తిరెడ్డికి చెందిన వేగనార్ వాహనంలోకి వెళ్లి కూర్చుంది. దీంతో ఆమెను తీసుకుని వారు వెళ్లిపోయారు. అనంతరం ఆ రోజు రాత్రి స్వాతి ఇంటి పరిసరాల్లో ఒక మోటార్ సైకిల్ తిరగడాన్ని శ్రీనివాసరెడ్డి, సత్తిరెడ్డి గమనించారు.

 దీంతో వారిద్దరూ ఒక రాడ్డు పట్టుకుని దానిని వెంబడించారు. వారు బైక్ ను అనుసరిస్తుంటే... అర కిలోమీటర్ దూరంలో వారికి నరేష్ తారసపడ్డాడు. దీంతో వారు ఇక్కడేం చేస్తున్నావు? అంటూ నరేష్ ను ప్రశ్నించి. 'మాట్లాడాలి పద' అంటూ వారిద్దరూ అతనిని తమ బైక్ మధ్యలో కూర్చోబెట్టుకుని మరో అరకిలోమీటర్ దూరంలోని తమ పొలంలో ఉన్న బావి దగ్గరకు తీసుకెళ్లారు. నరేష్ తో సత్తిరెడ్డి మాట్లాడుతున్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి నరేష్ వెనుక నుంచి తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో ఆ దెబ్బకు నరేష్ స్పాట్ లోనే చనిపోయాడు. దీంతో నరేష్ శవాన్ని అక్కడి నుంచి కొంచం దూరంలో ఉన్న తన పొలంలోకి తీసుకెళ్లి, దానిని తగులబెట్టాడు. అయితే నరేష్ శవం పూర్తిగా కాలలేదు.

దీంతో ఆత్మకూరులోని పెట్రోల్ బంక్ కు వెళ్లి, ఐదు లీటర్ల పెట్రోలు, శివార్లలోని ఓ షాపు నుంచి నాలుగు పాత టైర్లు కొనుగోలు చేసి తీసుకొచ్చారు. నేరుగా నరేష్ శవం వద్దకు వారిద్దరూ వెళ్లి.... రెండు టైర్లు నరేష్ శవం కింద, మరో రెండు టైర్లు నరేష్ శవంపైన... ఆ టైర్ల కిందా పైన గడ్డి వేసి దానిపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ సారి తెల్లవారుజాము నాలుగు గంటలకు నరేష్ శవం పూర్తిగా కాలిపోయింది. దీంతో మిగిలిన అస్థికలు, బూడిద ఒక బస్తాలో వేసి మూటకట్టి, దగ్గర్లోని మూసీ నదిలో పారేశారు. అనంతరం నరేష్ సెల్ ఫోన్ పట్టుకుని సత్తిరెడ్డి బోడుప్పల్ లోని తన ఇంటికి వచ్చాడు. తరువాత దానిని ధ్వంసం చేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు వెళ్లి, శ్రీనివాస్ రెడ్డితోపాటు కలిపి ఇతర బంధువులతో బాధ పడుతున్నట్టు నటించాడు.

స్వాతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా కట్టుకథలు అల్లాడు. దొంగ ఏడుపులు ఏడ్చాడు. నరేష్ గురించి అడిగితే తెలియదని చెప్పాడు. ఎట్టకేలకు తమ టీమ్ లు చేసిన దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలతో ఇంటరాగేషన్ చేయగా శ్రీనివాస్ రెడ్డి నిజం కక్కాడు. సత్తిరెడ్డి కూడా నేరం అంగీకరించాడు. ఇందులో కూడా పలు అనుమానాస్పద అంశాలున్నాయి. స్వాతి ఆత్మహత్య సెల్ఫీ వీడియోపై దర్యాప్తు జరుగుతోంది. అలాగే స్వాతి ఆత్మహత్యకు పాల్పడేనాటికి నెలరోజుల గర్భవతి అని పోస్టు మార్టం రిపోర్టులో ఉంది. దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చిన గడువులోపు కేసును ఛేదించాము" అని పోలీస్ కమీషనర్, డీసీపీ వివరించారు.

More Telugu News