: 50 సెకెన్లలో రతన్ టాటాను చూసి స్పూర్తి పొందాను: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు

ముంబైకి చెందిన సుమీత్‌ నగదేవ్‌ అనే వ్యక్తి హోటల్‌ తాజ్‌ లో ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన కేవలం 50 సెకెన్లలో రతన్ టాటాను చూసి స్పూర్తి పొందానని చెబుతున్నారు. దానికి కారణం అసాధారణమైన పనులు చేయడం కాదని, సాధారణమైన పనులు అసాధారణ రీతిలో చేయడమేనని ఆయన చెబుతున్నారు. ఇంతకీ ఆయన స్పూర్తి పొందన ఘటన వివరాల్లోకి వెళ్తే... ‘నేను ముంబైలోని తాజ్‌ హోటల్‌ లో కార్యక్రమం కోసం వచ్చాను. ఈ సమయంలో నేను హాటల్ బయట ఉండగా, ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా దిగారు. హోటల్ కు వచ్చిన ఆయన వెంట భద్రతా సిబ్బంది ఎవరూ లేరు. హోటల్ కు చెందిన ఇద్దరు మేనేజర్లు మాత్రమే ఉన్నారు.

వారితో మాట్లాడుతుండగా...ఒకరు వచ్చి ఆయనకు పార్కింగ్ టికెట్ ఇచ్చారు. టాటాకు పార్కింగ్ టికెట్ ఇవ్వడమేంటి? అని నేను ఆశ్చర్యపోయేంతలో ఆయన కారు దగ్గరకెళ్లి స్వయంగా కారును పార్క్ చేసుకున్నారు. పార్కింగ్ టికెట్ ఆయన తీసుకోవడంతోనే ఆశ్చర్యంలో మునిగిన నేను, ఆయన సాధారణ పౌరుడిలా క్యూలో తన కారును స్వయంగా పార్క్ చేసుకోవడంతో మరింత ఆశ్చర్యానికి గురై అక్కడే ఉన్న ఆయన కారు డ్రైవర్ ను అడిగాను..ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంటారా? ఈ రోజు సరదాగా అలా చేశారా? అని అడిగాను.

దానికి ఆయన సమాధానమిస్తూ...రతన్ టాటా అద్భుతమైన వ్యక్తి. ఆయన కారు రావడాన్ని గమనించిన సిబ్బంది ముందు కార్లను తప్పుకోమని చెప్పడాన్ని కూడా ఆయన అంగీకరించరని అన్నారు. సాధారణ కార్లలాగే తన కారును కూడా చెక్ చేయమని చెబుతార’ని అన్నారు. దీంతో నిజమైన నాయకత్వం అంటే అది అనిపించిందని ఆయన తన ఫేస్ బుక్ పేజ్ లో రాసుకొచ్చారు. కేవలం 50 సెకెన్లలోనే ఆయనంటే ఆరాధనా భావం పెరిగిందని చెప్పారు. అంత తక్కువ సమయంలో నిజమైన నాయకత్వం అంటే అసాధారణ పనులు చేయడమే కాదు, సామాన్యమైన పనులను కూడా అసాధారణంగా చేయడమని నిరూపించడం తనలో స్పూర్తిని రగిలించిందని ఆయన తెలిపారు.

More Telugu News