: మిగిలింది రెండే.. ఈవీఎం చాలెంజ్‌కు తోకముడిచిన ప్రధాన పార్టీలు.. సీపీఎం, ఎన్‌సీపీ సై!

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని పలు పార్టీలు గగ్గోలు పెట్టాయి. తమకు అవకాశం ఇస్తే నిరూపించి చూపిస్తామని సవాలు విసిరాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ కావని, చేయలేరని ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా వినకుండా నానా రభస చేశాయి. దీంతో వాటిని ట్యాంపర్ చేసి చూపించాలని ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలకు సవాలు విసిరింది. జూన్ 3 నుంచి ట్యాంపర్ చేయవచ్చంటూ దేశంలోని 7 జాతీయ పార్టీలు, 48 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. దీంతో సవాలు చేసిన పార్టీల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. ఏదో ఒక కారణంతో ఒక్కో పార్టీ సవాలు నుంచి తప్పుకున్నాయి. ఇప్పుడు మిగిలింది కేవలం రెండే. ఒకటి ఎన్‌సీపీ, రెండోది సీపీఎం.

వచ్చే నెల 3న జరగనున్న సవాలును ఈ రెండు పార్టీలు మాత్రమే స్వీకరించాయి. బీజేపీ, సీపీఐలు ఈ సవాలులో పాల్గొనడం లేదని ఇది వరకే ఈసీకి తెలపగా, మదర్‌బోర్డుల హ్యాక్‌కు అనుమతించాలని ఆప్ కొత్త పల్లవి అందుకుంది. సవాలులోని నిబంధనలు సవరించాలంటూ కాంగ్రెస్ కోరింది. అయితే వాటి అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది.  తాము ఈ చాలెంజ్‌లో పాల్గొంటామని ఆర్జేడీ శుక్రవారం లేఖ రాసింది. అయితే ఇది సాయంత్రం 5:39 గంటలకు ఈసీకి అందింది. అప్పటికే ఈసీ విధించిన గడువు ముగియడంతో దానికి పాల్గొనే అర్హత లేకుండా పోయింది. దీంతో చివరికి బరిలో ఎన్‌సీపీ, సీపీఎం మాత్రమే నిలిచి దేశం దృష్టిని ఆకర్షించాయి. మరి, ఇవి ఈవీఎంలను హ్యాక్ చేసి నిరూపిస్తాయో, లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

More Telugu News