: లార్డ్స్ లో తగిలిన బంతులకి కిందపడి విలవిల్లాడిపోయిన గ్లెన్ మ్యాక్స్ వెల్, మాథ్యూవేడ్

ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇంగ్లండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో తగిలిన బౌన్సర్ కు కిందపడి విలవిల్లాడిపోయాడు. భారత్ నుంచి ఆసీస్ చేరుకుని ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు ఇంగ్లాండ్‌ చేరుకున్న ఆసీస్‌ జట్టు లార్డ్స్‌లో సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ లో బౌన్సర్ రూపంలో వేసిన బంతి బలంగా అతని మెడకు తాకింది. దీంతో కిందపడి విలవిల్లాడిపోయాడు. వెంటనే సహచర ఆటగాళ్లు వచ్చి అతనిని గ్రౌండ్ లోంచి బయటకు తీసుకొచ్చారు. జట్టు వైద్యుడు పీటర్‌ బ్రూక్‌ నర్‌ వెంటనే మ్యాక్స్‌ వెల్ కు ఐస్ పెట్టి, బాధ నుంచి ఉపశమనం కలిగేలా చేశారు. అనంతరం, మ్యాక్స్ వెల్ ఇక డ్రెస్సింగ్ రూమ్ కు పరిమితమయ్యాడు.

ఆ తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లు ప్రాక్టీస్ కొనసాగించారు. ఇంతలో మాథ్యూవేడ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పాట్ కమ్మిన్స్ వేసిన బంతి వేడ్ హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో వేడ్ బాధతో కిందపడ్డాడు. ఒక్క నిమిషం పాటు అలాగే ఉండిపోయాడు. దీంతో ఆటగాళ్లు ఆందోళన చెందారు. ఆ తర్వాత వేడ్ కూడా ప్రాక్టీస్ ముగించాడు. దీనిపై ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ, ప్రాక్టీస్ లో చిన్నచిన్న ఘటనలు సహజమని అన్నాడు. అయితే మ్యాక్స్ వెల్, వేడ్ ల గాయాలు పెద్దవి కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. కాగా, తొలి వార్మప్ మ్యాచ్ లో శ్రీలంకతో ఆసీస్ ఆడనుంది.

More Telugu News