: మీరు టీ, కాఫీ ప్రియులా... అయితే ఇది శుభవార్తే!

ఉదయం నిద్రలేవగానే బెడ్ కాఫీతో రోజువారీ దినచర్యను మొదలు పెట్టే వారెందరో. ఆఫీసులో పని చేస్తున్నా, రెండు గంటలకోసారి కాఫీయో, టీయో తాగితేనే కానీ చెయ్యి కదిలే పరిస్థితి వుండదు. అటువంటి వారికి శుభవార్త. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత టీ, కాఫీ, పాల పొడి, పంచదార ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇన్ స్టంట్ కాఫీ మినహా, మిగతా అన్ని టీ, కాఫీ తయారీకి వాడే పదార్థాల ధరలు ఇప్పుడున్న స్థాయితో పోలిస్తే దిగిరానున్నాయి.

గతవారంలో శ్రీనగర్ లో సమావేశమైన రాష్ట్రాల ఆర్థిక మంత్రులు టీ, కాఫీలపై జీఎస్టీ ఎంత ఉండాలన్న విషయమై ఏకాభిప్రాయానికి రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ, జీఎస్టీలో భాగంగా టీ, కాఫీలపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను పూర్తిగా మినహాయిస్తున్నామని ప్రకటించింది. కేవలం 5 శాతం వ్యాట్ మాత్రమే వసూలు చేస్తామని స్పష్టం చేసింది. ఇక కాఫీ, టీల తయారీకి అవసరమైన పాల పొడి, పంచదార ధరలు కూడా తగ్గనున్నాయి.

ప్రస్తుతం క్వింటాలు పంచదారపై రూ. 71 సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్, రూ. 124 మేరకు పన్నులను వసూలు చేస్తుండగా, మొత్తం ధరను ఈ సుంకాలు 8 శాతం మేరకు పెంచుతున్నాయి. జీఎస్టీలో పంచదారను 5 శాతం శ్లాబ్ లో ఉంచడంతో 3 శాతం వరకూ ధర తగ్గనుంది. ఇక పాల పొడిపై ఇప్పటివరకూ 7 శాతం వరకూ పన్నులుండగా, అది కూడా 5 శాతం శ్లాబ్ లోకి వచ్చి చేరింది. దీంతో రోజుకు మూడు కప్పుల కాఫీ లేదా టీ తాగేవారు మరో కప్పు అదనంగా తాగే వెసులుబాటు కలగనుంది.

More Telugu News