: ఆర్థిక సాయంలో కోత.. పాకిస్థాన్ కు ఊహించని షాకిచ్చిన అమెరికా!

చైనాతో సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్న పాకిస్థాన్ వైఖరి పట్ల గుర్రుగా ఉన్న అమెరికా పలు సందర్భాల్లో ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ అత్యంత విశ్వసనీయమైన దేశం కాదని పేర్కొంది. అలాగే ఉగ్రవాద దేశమని కూడా పలు సందర్భాల్లో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం పేరుతో అమెరికా గతంలో పాకిస్థాన్ కు బిలియన్ డాలర్లు గుమ్మరించింది. ఈ నిధులను పాకిస్థాన్ ఉగ్రవాద దాడులు, సరిహద్దులో ఉద్రిక్తతల కోసం వినియోగిస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినా అమెరికా పట్టించుకోలేదు. అయితే ఇంటెలిజెన్స్ నివేదికలతో కళ్లు విప్పిన అమెరికా గత రెండేళ్లుగా పలు కోతలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అన్న నినాదాన్ని బలోపేతం చేసుకునేందుకు అమెరికా ఇతర దేశాలకు ఉదారంగా ఇచ్చే నిధుల్లో కోత విధించారు. అందులో భాగంగా తాజాగా పాకిస్తాన్‌ కు అందిస్తున్న ఉగ్రవాద పోరాట నిధుల్లో కోత విధించాలని ట్రంప్‌ సర్కార్‌ ప్రతిపాదించింది.

2002 నుంచి ఇప్పటి వరకు పాక్ కు అమెరికా 14 బిలియన్ డాలర్లు (90 లక్షల కోట్ల రూపాయలు) అందజేసింది. ఇకపై సంకీర్ణ కూటమి నిధుల్లో (సీఎస్‌ఎఫ్‌) 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు 645 కోట్ల రూపాయల) మేర కోత విధించాలని నిర్ణయించింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో 900 మిలియన్‌ డాలర్ల (దాదాపు 5,800 కోట్ల రూపాయల) కు బదులుగా 800 మిలియన్‌ డాలర్ల (దాదాపు 5,160 కోట్ల రూపాయలు) ను మాత్రమే ఇవ్వాలని బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ విభాగ (పాక్, ఆఫ్ఘన్, మధ్య ఆసియా దేశాల) ప్రతినిధి ఆడమ్ స్టంప్ ప్రకటన చేశారు.  

More Telugu News