: ఢిల్లీలో ప్రసిద్ధ 'జన్ పథ్' హోటల్ మూత... ఇక అక్కడ ప్రభుత్వ కార్యాలయం!

దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రసిద్ధ హోటల్ జన్ పథ్ మూతపడనుంది. ఈ హోటల్ భవంతిని పట్టణాభివృద్ధి శాఖకు అప్పగిస్తూ, నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ ఐటీడీసీ (ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) కింద ఈ హోటల్ ఉండగా, ఆ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు పచ్చజెండా ఊపిన కేంద్రం, అందులో భాగంగానే ఈ భవనాన్ని వెనక్కు తీసుకుంది. ఇకపై దీనిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

ఐటీడీసీ అధీనంలోని ఇతర ఆస్తుల విషయమై, కార్యదర్శుల స్థాయి కమిటీ చర్చించి చేసే సిఫార్సులను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఈ భవంతి నిర్మాణం హోటల్ నిర్వహణకు అనుకూలంగా లేదని భావించామని, పైగా నష్టాలు వస్తున్నందున దీన్ని మూసేస్తున్నామని తెలిపింది. ఐటీడీసీ అధీనంలో నడుస్తున్న భోపాల్ లోని హోటల్ లేక్ వ్యూ అశోక్, గౌహతిలోని హోటల్ బ్రహ్మపుత్ర అశోక్, భరత్ పూర్ లోని హోటల్ భరత్ పూర్ అశోక్ లనూ కేంద్రం వెనక్కు తీసుకోనుంది.

More Telugu News