: పచ్చి అబద్ధాలు చెబుతున్న పాకిస్థాన్: ఐరాస

వాస్తవాధీన రేఖ ప్రాంతంలో వెళుతున్న ఐక్యరాజ్యసమితి వాహనాన్ని లక్ష్యం చేసుకుని భారత్ కాల్పులు జరిపిందని పాకిస్థాన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఐరాస స్పష్టం చేసింది. నిన్న ఎల్ఓసీ వద్ద యూఎన్ వెహికిల్ పై భారత సైన్యం దాడికి దిగిందని, వాహనంలో యూఎన్ మిలటరీ పరిశీలకులు ఉన్నారని, ఈ ఘటన కాంజహార్ సెక్టారులో జరిగిందని పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం నిజం కాదని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

"పరిశీలకుల వాహనంపై ఎటువంటి దాడీ జరగలేదు. పాక్ సైన్యం ఏవైనా గన్ షాట్స్ విని ఉండవచ్చు. యూఎన్ ప్రతినిధులను మాత్రం ఎవరూ లక్ష్యంగా చేసుకోలేదు. ఎవరికీ గాయాలు కాలేదు" అని స్టెఫానీ డుజారిక్ వెల్లడించారు. కాగా, ఇటీవలి కాలంలో ఎల్ఓసీ వెంట పాక్ నిత్యమూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాము పాక్ బంకర్లను ధ్వంసం చేశామని భారత్ ప్రకటించగా, తాము కూడా అదే పని చేశామని పాక్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇరు దేశాలూ తమ బంకర్లపై ప్రత్యర్థుల దాడులు అబద్ధాలని ప్రకటించుకున్నాయి.

More Telugu News