: స్నేహమేరా జీవితం: మిత్రుని కోసం 20 కేజీల బరువు తగ్గి, కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ మహిళ

"స్నేహానికన్న మిన్న లోకాన ఏది లేదురా" అని ఒక సినీ కవి అంటే... మరోకవి "స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం" అన్న మాటలను నిరూపించే ప్రయత్నంలో ఓ మహిళ ఉంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని పెన్సిల్వేనియాకి చెందిన రిబాక్‌ సెయిడ్రోతో పాటు క్రిస్‌ మూర్‌ అనే వ్యక్తి ఒక రెస్టారెంట్‌ లో ఐదేళ్లపాటు కలిసి పనిచేశారు. ఈ సమయంలో వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. అయితే వాళ్ల ఉద్యోగాలు శాశ్వతం కాకపోవడంతో... వారిద్దరూ విడిపోయారు. కానీ ఫేస్ బుక్ లో టచ్ లో ఉండేవారు.

అయితే, గత కొంత కాలంగా ఫేస్ బుక్ కి దూరంగా ఉన్న సెయిడ్రో గత సెప్టెంబర్ లో ఫేస్‌ బుక్‌ ప్రొఫైల్‌ చూసి షాక్‌ కు గురైంది. కారణం, క్రిస్ మూర్ తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో...తన కిడ్నీ పాడైపోయిందని, కిడ్నీ మార్పిడి అవసరమని పోస్టు చేశాడు. దీంతో స్నేహితుడి కష్టాన్ని అర్ధం చేసుకుని, వెంటనే మూర్‌ ని కలిసి ధైర్యం చెప్పింది. అంతే కాకుండా తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమని తెలిపింది. దీంతో పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కిడ్నీ పనికొస్తుందని, అయితే ఆరోగ్యంగా ఉన్నవారి కిడ్నీని మాత్రమే తీసుకుంటామని, స్థూల కాయుల కిడ్నీ పనికిరాదని తెలిపారు.

అందుకని, ప్రస్తుతమున్న 110 కేజీల తన బరువును 90 కేజీల లోపుకు తగ్గించుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. దీంతో సెయిడ్రో తన జీవన శైలిని పూర్తిగా మార్చేసుకుంది. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్, హెల్దీ డైట్.. ఇలా పలు జాగ్రత్తలు పాటిస్తూ, పలు పోటీల్లో పాల్గొంటూ 20 కేజీల బరువు తగ్గింది. దీంతో ఆమె కిడ్నీని తీసుకునేందుకు వైద్యులు అంగీకరించారు. త్వరలో ఆమె కిడ్నీని తన స్నేహితుడికి దానం చేయనుంది. బంధువులే పెద్దగా పట్టించుకోని ఈ రోజుల్లో ఆమె స్నేహం కోసం చేసిన శ్రమ, త్యాగాన్ని అంతా కీర్తిస్తున్నారు.

More Telugu News