: ప్రపంచపు అతిపెద్ద ఐపీఓలో భాగం కానున్న మోదీ సర్కారు!

ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రానున్న సౌదీ అరామ్కో నిధుల సమీకరణలో మోదీ సర్కారు తనవంతు భాగస్వామ్యాన్ని పొందే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థగా ఉన్న సౌదీ అరామ్కో, వచ్చే సంవత్సరం ఐపీఓకు రానున్న నేపథ్యంలో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ఈ సంస్థతో మరింత బలమైన బంధాన్ని పెట్టుకోవడం ద్వారా భారత చమురు అవసరాలను సులువుగా తీర్చుకోవచ్చని, అందువల్ల సౌదీ దిగ్గజంలో వాటాలను కొనుగోలు చేసేలా పెట్టుబడి పెట్టే అవకాశాలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు యోచిస్తున్నాయని అన్నారు.

సౌదీ అరామ్కోలో పెట్టుబడులు పెడితే, దీర్ఘకాల ప్రయోజనాలు సిద్ధిస్తాయని తెలిపారు. తమ ఆలోచన గురించి సౌదీ ఇంధన అధికారులతో మాట్లాడామని, ఓ జాయింట్ వెంచర్ సంస్థను ప్రారంభించే ఆలోచన కూడా ఉందని తెలిపారు. సౌదీ సంస్థతో కలసి 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ రిఫైనరీ కాంప్లెక్స్ ను నిర్మించాలని పీఎస్యూ చమురు సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు. కాగా, 2 ట్రిలియన్ డాలర్ల విలువైన చమురు నిక్షేపాలను కలిగివున్న సౌదీ అరామ్కో, వచ్చే సంవత్సరం 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,50,000 కోట్లు) విలువైన వాటాలను విక్రయించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News