: టీవీ లైవ్ షోలో చలపతిరావు, మహిళా సంఘాల నేతల మధ్య సంవాదం!

స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు చలపతిరావు బయట ఎలా తిరుగుతాడో చూస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు. వయసులో పెద్దవాడైన చలపతిరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని స్పూర్తిగా తీసుకునే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ షోలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా చలపతిరావు కూడా లైవ్ లోకి వచ్చి, తాను చేసిన వ్యాఖ్యతోనే ప్రపంచం తల్లకిందులు అయిపోవడం లేదని... ఇంతకంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాడితే సమాజానికి సేవ చేసినవారవుతారని ఆయన సదరు మహిళా సంఘాల నేతలకు చెప్పారు. సినీ పరిశ్రమలో తాను ఇప్పుడే లేనని, తానేంటన్నది తన గురించి తెలిసినవారికి తెలుసని, ఈ రాద్ధాంతం ఇంతటితో ఆపెయ్యాలని ఆయన సూచించారు.

అనంతరం ఇంకాస్త వివరణ ఇస్తూ, తాను పొరపాటున నోరు జారానని అన్నారు. పొరపాటున తన నోటి ద్వారా ఒక తప్పుడు మాట దొర్లిందని... దానికి మహిళలంతా హర్ట్ అయ్యారని తెలిసి బాధపడ్డానని అన్నారు. అలా బాధపడ్డవారికి తన క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని ఆయన చెప్పారు. దీనిపై తనను ఎవరు ప్రశ్నించినా సమాధానం కూడా చెప్పనని ఆయన తెలిపారు.

ఈ సంవాదం సందర్భంగా మహిళా నేత దేవిని ఉద్దేశిస్తూ ఆయన 'నువ్వు' అంటూ సంబోధించడాన్ని సదరు మహిళా నేత తప్పుపట్టారు. తాను ఆయనను 'అండీ' అని అంటుంటే, ఆయన 'నువ్వు' అంటున్నాడని ఆమె మండిపడ్డారు. దీనిపై చలపతిరావు స్పందిస్తూ, ఆమెను 'దేవీ' అంటూ సంబోధించడం వెనుక తన వయసు పెద్దరికమే తప్ప... ఆమెతో చనువు ఉందని అర్థం కాదని చెప్పారు. వయసులో పెద్దవాడినన్న ఆలోచనతోనే ఆమెను దేవీ అంటే... ఆమె దానిని కూడా తప్పుగా తీసుకుంటే ఇక తానేమీ చేయలేనని అన్నారు.

More Telugu News