: ఇంత ఘోర అవమానమా? : పాక్ మీడియా ఆక్రోశం

 సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన విధానం పాకిస్థాన్ కు అవమానకరమని పాక్ మీడియా తెగబాధపడిపోతోంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కొద్దిసేపు మాట్లాడిన ట్రంప్... ఆ తరువాత జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు ప్రతిదేశం ఉగ్రవాద బాధిత దేశమేనని పేర్కొన్నారు. భారత్ పేరును ఉగ్రబాధిత దేశంగా పేర్కొనడంతో పాటు, 35 ముస్లిం మెజారీటీ దేశాల్లో అతిపెద్ద ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ కు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని పాక్ మీడియా తీవ్ర అవమానంగా అభివర్ణిస్తోంది.

 అంతే కాకుండా ట్రంప్ మాట్లాడుతూ, ప్రతిసారి అమెరికా వచ్చి శత్రువును (ఒసామా బిన్ లాడెన్ వంటి వారిని) తుదముట్టిస్తుందని చూడకూడదని, మీ భవిష్యత్ తరాలకు ఎలాంటి దేశాలను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదంపై యుద్ధమంటే పశ్చిమ దేశాలకు, ఇస్లామ్‌ కు మధ్య పోరుగా భావించరాదని సూచించిన ఆయన, పశ్చిమాసియా దేశాలు తమగడ్డ మీద నుంచి విస్తరిస్తున్న ఇస్లామిక్‌ తీవ్రవాదంపై గట్టి పోరాటం చేయాలని అన్నారు. దీనిపై పాక్ మీడియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ట్రంప్ పాక్ ను అవమానించారని మీడియా కథనాలు ప్రసారం చేసింది.

More Telugu News