: రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కొసాగుతున్న ఆందోళనలు...సుబ్రహ్మణ్యస్వామి, శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఆయనను వ్యతిరేకిస్తూ తమిళర్‌ మున్నేట్ర పడై కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కెథడ్రెల్ రోడ్డులో 'కబాలి' దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కన్నడిగుడైన రజనీకాంత్ ఎన్నటికీ తమిళుడు కాలేడంటూ నినాదాలు చేశారు. రజనీ తమిళనాడుకు అక్కర్లేదని, కర్ణాటకకు వెళ్లిపోవచ్చని వారు సూచించారు. వారి ఆందోళనలపై రజనీ అభిమానులు మండిపడుతున్నారు. రజనీకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే కనుక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అంతేకాకుండా వారు కూడా రోడ్డెక్కి తమిళర్ మున్నేట్ర పడైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, సినీ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోరని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. రజనీ నటనకు మాత్రమే సరిపోతారని, ఆయన నటనకే పరిమితం కావాలని ఆయన సూచించారు. శరత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజావేదికలపై ప్రసంగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రజనీకాంత్‌ను ఉద్దేశించి అన్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని రైతులు తొలిసారిగా సూపర్‌ స్టార్‌ ను వ్యతిరేకిస్తారని పేర్కొన్న ఆయన, అందులో భాగంగా ఆయన కొత్త సినిమా ‘2.ఓ’ను అడ్డుకోవాలని చూసినా ఆశ్చర్యపోనక్కరలేదని వివాదాన్ని మరింత రాజేసే ప్రయత్నం చేశారు. అయితే రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్నది ఆయనకు సంబంధించిన వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News