: మలాలాపై దాడి నాటకం... అంతా బూటకం: పాకిస్థాన్ నేత సంచలన ఆరోపణలు

పాకిస్థాన్ కు చెందిన నోబెల్‌ పురస్కార గ్రహీత యూసఫ్‌ జాయ్‌ మలాలాపై దాడి అంతా ఓ భూటకం అంటూ పాకిస్థాన్ పార్లమెంటు సభ్యురాలు ముస్సారత్‌ అహ్మద్‌ జేబ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇస్లామాబాద్ లో ఉమ్మత్ అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మలాలాపై దాడి ఘటన ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్టు ప్రకారం జరిగిందని సంచలన ప్రకటన చేశారు. 2012లో మలాలాపై జరిగిన దాడి బీబీసీ చానెల్‌ కోసం సిద్ధం చేసిన ప్రణాళిక ఆధారంగా జరిగిందని అన్నారు. ఆ దాడిలో మలాలా తలకు బుల్లెట్‌ తగిలింది, కానీ స్వాత్ లో తీసిన సీటీ స్కాన్ లో ఆ బుల్లెట్ ఆమె తలలో ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు... మరి పెషావర్ లోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రి రిపోర్టుల్లో మాత్రం ఆమె తలలోకి బుల్లెట్ వచ్చింది...ఎలా? అని ఆమె అడిగారు.

ఈ విషయంపై ఆమెకు చికిత్స చేసిన వైద్యులు కూడా మిలటరీ ఆసుపత్రి రిపోర్టులతో విభేదించారని ఆమె చెప్పారు. ఆ వైద్యులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలాలు కూడా ఇచ్చిందని ఆమె వెల్లడించారు. బీబీసీలో చూపించినట్లుగా మలాలాకు అసలు చదవడం, రాయడం రాదని ఆమె చెప్పారు. ఒక అమెరికన్‌ మలాలా ఇంట్లో మూడు నెలలు ఉండి ఆమె నిర్వహించాల్సిన పాత్రపై శిక్షణ ఇచ్చారని ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీలో ఉన్న ఆమె ఇలా అకస్మాత్తుగా మలాలాపై ఎందుకు ఆరోపణలు చేశారో తెలియనప్పటికీ... ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను కలకలం రేపుతున్నాయి. కాగా, భారత్ కు చెందిన బాలహక్కుల సామాజిక కార్యకర్త కైలాష్ సత్యార్థితో కలిసి మాలాలా నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News