: ఎండలకు మృత్యువాత పడుతున్న కోళ్లు.. మాంసం ధరలు మరింత ప్రియం!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కోళ్లు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల్లోని కోళ్లు వేడిని తట్టుకునేందుకు ఉపశమన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం ఉండట్లేదు. ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పదమూడు లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్టు అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోళ్లు చనిపోతున్నాయని కోళ్ల రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోళ్లు చనిపోవడం ద్వారా సుమారు రూ.19.50 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వాటికి ప్రాణాపాయమేనని, అందుకనే, కోళ్ల ఫారాలపై పట్టాలు కప్పడం, తుంపర పరికరాలు, స్ప్రేయర్ల ద్వారా నీళ్లు చల్లడం వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ వాటి ప్రాణాలు కాపాడలేకపోతున్నామని ఏపీ పౌల్ట్రీ సమాఖ్య కోశాధికారి డాక్టర్ సోమిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉందగా, ఎండల కారణంగా మాంసం వినియోగం తగ్గినా వాటి ధరలు మాత్రం పెరిగాయని అన్నారు. కోళ్లు చనిపోవడంతో పాటు వాటి ఎదుగుదల తగ్గిపోవడమే ధరలు పెరగడానికి ప్రధాన కారణమని కోళ్ల రైతులు అంటున్నారు.

More Telugu News