: ట్రాఫిక్ పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో లారీకింద పడిన యువకులు.. దుర్మరణం

ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారన్న భయం ఇద్దరు యువకుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. వారి నుంచి తప్పించుకునేందుకు రాంగ్ రూట్‌లో వెళ్లిన యువకులను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లోని టోలిచౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాపూఘాట్ సమీపంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా బుద్వేల్ నుంచి బైక్‌పై వస్తున్న శ్రీనివాస్ (19), రాజేశ్ (24) వారిని చూశారు.

అప్పటికే వారు మద్యం మత్తులో ఉండడంతో వాహనాన్ని వెనక్కి తిప్పి రాంగ్‌రూట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అటునుంచి సిమెంట్ లోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి తొలుత కారును, ఆ తర్వాత  ట్రాఫిక్ పోలీసుల క్రేన్‌‌తోపాటు రాంగ్ రూట్‌లో వెళ్తున్న యువకుల బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యువకులు శ్రీనివాస్, రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో లారీని మితిమీరిన వేగంతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కొడంగల్‌కు చెందిన లారీ డ్రైవర్ అనంతయ్య (27)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More Telugu News