: సవాలుకు డేట్ ఫిక్స్ చేసిన ఈసీ.. జూన్ 3 నుంచి పార్టీలకు చాన్స్.. ట్యాంపరింగ్ నిరూపిస్తారో? చతికిలపడతారో!

మొత్తానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సవాలుకు డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 3 నుంచి ట్యాంపరింగ్ సవాలు ప్రారంభమవుతుందని పేర్కొంటూ ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయమే అందుకు వేదికని పేర్కొంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ సవాలును స్వీకరించి పాల్గొనవచ్చని సూచించింది. అయితే పాల్గొనే పార్టీలు మాత్రం ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు తెలపాలని కోరింది.

ఎన్నడూ లేనంతగా ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు తీవ్రస్థాయిలో ఆరోపించారు. దీంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని తేల్చి చెప్పింది. తాము ఉపయోగిస్తున్న ఈవీఎంలు పటిష్ట భద్రతా ప్రమాణాలతో కూడుకున్నవని, వాటిని ట్యాంపర్ చేయడం అసాధ్యమని, అందులోని అంతర్గత  సర్క్యూట్‌ను మార్చడం ఎవ్వరి వల్లా కాదని తేల్చి చెప్పింది. అయినా విపక్షాలు అంగీకరించకపోవడంతో ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎం ఇస్తామని దానిని ట్యాంపర్ చేసి చూపించాలని ఈసీ సవాలు విసిరింది. అందులో భాగంగానే తాజాగా తేదీని నిర్ణయించింది.  

సవాలు ఇలా..
సవాలులో భాగంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలలో ఏవైనా నాలుగు పోలింగ్ బూతుల నుంచి నాలుగు ఈవీఎంలు ఎంచుకోవచ్చు. అవి ఏ రాష్ట్రానివైనా, ఏ బూత్‌వైనా కావచ్చు. తర్వాత ట్యాంపరింగ్ చేయాలనుకున్న పార్టీల ప్రతినిధులకు నాలుగు గంటల సమయం ఇస్తారు. ఆ సమయంలో వాటిని ట్యాంపర్ చేసి చూపించాలి. ట్యాంపర్ చేసే సమయంలో ఈవీఎం పనికిరాకుండా పోయినా, పాత ఫలితాలే కనిపించినా అతడు విఫలం అయినట్టే. ఇటీవల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ఓటింగ్‌కు ముందే ట్యాంపర్ అయినట్టు నిరూపించడం రెండో సవాలు. స్ట్రాంగ్ రూముల్లో భద్ర పరిచిన సీల్డ్ ఈవీఎంలను పార్టీ ప్రతినిధులకు ఇస్తారు. ఈవీఎం పనికిరాకుండా పోయినా,  ఎవరికి ఓటేస్తే వారికే పడినా ట్యాంపరింగ్‌ను నిరూపించడంలో వారు విఫలమైనట్టే.

More Telugu News