: భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం.. గంటపాటు రైలు నిలిపివేత

తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి పది గంటల సమయంలో రైలు తుని రైల్వే స్టేషన్ దాటిన తర్వాత హంసవరం స్టేషన్ సమీపంలో రైలు గేర్‌బాక్స్‌గా భావిస్తున్న భారీ పరికరం రైలు నుంచి ఊడి పట్టాలను తాకుతూ నిప్పులు చిమ్ముకుంటూ పడింది. ఎస్-11 బోగీకి చెందిన ఈ పరికరం పట్టాలను రాసుకుంటూ వెళ్తుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చైను లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో పక్క బోగీలోకి వెళ్లి చైన్ లాగి రైలును ఆపారు. పెద్ద ట్యాంకు లాంటి ఆ పరికరం పట్టాల కింద ఉండే రాళ్లను తాకుతూ వెళ్తుండడంతో నిప్పు రవ్వలు ఎగసి పడ్డాయని ప్రత్యక్ష  సాక్షులు తెలిపారు. ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలును గంటపాటు నిలిపివేసి మరమ్మతులు చేసి పంపించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైలుకు మరమ్మతుల కారణంగా నిలిపివేయడంతో ఆ మార్గంలో సికింద్రాబాద్ వెళ్తున్న గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ను అరగంటపాటు నిలిపివేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News