: మా బ్యాంకులో స్థలం లేదు.. రూ.10 నాణేలు తీసుకోము!: ఖాతాదారుడికి ఓ ఎస్‌బీఐ షాక్

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత బ్యాంకుల్లో నుంచి ఖాతాదారులు పెద్దమొత్తంలో రూ.10 నాణేలను తీసుకొని వాడారు. అయితే రెండు, మూడు నెలల నుంచి ఆ నాణేలు చెల్లుబాటు కావట్లేదంటూ ఎన్నో వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ నాణేల‌ను ఏ షాపులో ఇచ్చినా తీసుకోవ‌డం లేదు. వ‌దంతులు విప‌రీతంగా వ్యాపించ‌డంతో ఆర్‌బీఐ కూడా స్పందించి రూ.10 నాణేలు రద్దు చేసే ఆలోచన లేదని, అవి చలామణిలోనే ఉంటాయని తేల్చి చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో అయోమ‌యం త‌గ్గ‌లేదు.

ప్ర‌జ‌ల్లో అయోమ‌యాన్ని మ‌రింత పెంచేలా బ్యాంకులు కూడా అందుకు త‌గ్గ‌ట్లుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది రూ.10 నాణేల‌ను తీసుకోవ‌డం లేదు. రూ.10 నాణేల‌ను తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేద్దామ‌ని వెళ్లిన జడ్చర్లకు చెందిన కిరాణా వ్యాపారి సురేశ్‌ నిరాశ‌గా వెనుదిర‌గ‌వ‌ల‌సి వ‌చ్చింది. తన వ‌ద్ద ఉన్న రూ.5వేల విలువ చేసే రూ.10 నాణేలు తన ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లాన‌ని, తమ వద్ద చిల్లర డబ్బులు పెట్టుకోవడానికి స్థలం లేదని స‌మాధానం చెబుతూ త‌న‌ను తిప్పి పంపించేశారని మీడియాకు తెలిపాడు. తాము పదిరూపాయల కాయిన్స్‌ తీసుకోవడం లేదని, తమ బ్యాంకులో వాటికోసం స్థలం లేదని సంబంధిత బ్యాంకు మేనేజర్ లిఖిత పూర్వకంగా ఓ లేఖ కూడా రాసిచ్చారు.

More Telugu News