: యూఎస్ వీసా కోసం యువతి పెళ్లి నాటకం... భర్త ప్రయాణ వివరాలు చెప్పలేక అడ్డంగా బుక్కయిన వైనం!

తనకు కాబోయే భర్త అమెరికాలో ఉండటంతో, అతన్ని కలుసుకునేందుకు వెళ్లాలని భావించిన ఓ యువతి పెళ్లి నాటకం ఆడి కాన్సులేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుజరాత్ కు చెందిన కిరణ్ పార్మార్ అనే యువతికి అమెరికాలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. అతన్ని కలుసుకోవాలని భావించిన ఆమె, యూఎస్ లో ఉండే నికోలస్ జూడ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించింది. తనకు భర్తగా నటించేందుకు నికోలస్ కు లక్షన్నర రూపాయలు ఇచ్చింది.

ఇక అతనితో కలసి అమెరికా వీసా కోసం ముంబైలోని కాన్సులేట్ కు వెళ్లిన వేళ, అక్కడి అధికారులు నికోలస్ పాస్ పోర్టులో పలుమార్లు అమెరికాకు వెళ్లి వచ్చినట్టుగా కనిపించింది. తొలుత అనుమానం రానప్పటికీ, సాధారణ ఇంటర్వ్యూలో భాగంగా, ఆమె భర్త ఎప్పుడెప్పుడు యూఎస్ కు వెళ్లాడన్న ప్రశ్నకు కిరణ్ నుంచి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు మరింత లోతుగా ప్రశ్నలు గుప్పించేసరికి ఆమె దొరికిపోయింది. దీంతో కాన్సులేట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పుడు పెళ్లి పత్రాలు సమర్పించిన కేసులో కిరణ్ తో పాటు, ఆమెకు ఉత్తుత్తి భర్తగా నటించిన నికోలస్ కూ అరదండాలు పడ్డాయి.

More Telugu News