: సేవా పన్ను ఎగ్గొట్టే రెస్టారెంట్లను పట్టిస్తే డిన్నర్ ఫ్రీ!

ఫుడ్ బిల్లుతో పాటు ఎంచక్కా సేవా పన్నును కూడా తమ ఖాతాల్లో వేసేసుకుంటున్న రెస్టారెంట్లపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కొరడా ఝళిపించనుంది. సేవా పన్ను ఎగ్గొట్టే రెస్టారెంట్ల ఆటలు సాగకుండా ఉండేందుకు వాణిజ్య పన్నుల శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం, ఓ యాప్ ను తయారు చేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. ఆయా రెస్టారెంట్లలో తిన్న తర్వాత అందుకు సంబంధించిన బిల్లును అక్కడే వదిలిపెట్టకుండా, వెంట తెచ్చుకోవాలని వినియోగదారులకు ఆయన సూచించారు. ఆ బిల్లును ఫొటో తీసి సంబంధిత యాప్ ద్వారా తమకు పంపిస్తే, ఆ బిల్లు అసలుదో, దొంగదో తెలుసుకుంటామన్నారు.

అసలు బిల్లు అయితే సేవా పన్ను తమ శాఖకు చేరుతుందని, నకిలీ బిల్లు అయితే, ఆ పన్ను రెస్టారెంట్ ఖాతాలోకి వెళ్లి పోతుందని చెప్పారు. సేవా పన్ను తమ ఖాతాలో వేసుకునే రెస్టారెంట్లను పట్టించిన వినియోగదారుడికి ఆ రోజు హోటల్ బిల్లు మాఫీ చేస్తామన్నారు. ఆయా రెస్టారెంట్లపై దాడి చేసి మోసం చేసిన మొత్తాన్ని వసూలు చేస్తామన్నారు. ఈ విధంగా వసూలు చేసిన సొమ్ము నుంచి భారీ మొత్తంలో విజిల్ బ్లోయర్స్ (ప్రజా వేగులు)కు బహుమతిగా ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కాగా, వినియోగదారులు కడుతున్న 14.5 శాతం సేవా పన్ను ప్రస్తుత విధానం ప్రకారం నేరుగా వాణిజ్య పన్నుల శాఖ ఖాతాలోకి వెళ్లాలి. అయితే, రెస్టారెంట్లు మాత్రం అదనపు బిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఫుడ్ బిల్లుతో పాటు సేవా పన్నును తమ ఖాతాలోకి వేసుకుంటున్నాయి. దీంతో, వాణిజ్య పన్నుల శాఖకు వెళ్లాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారు.

More Telugu News