: ప్రేమించినవాడి కోసం రాచరికాన్ని వదులుకుంటున్న జపాన్ యువరాణి

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా రాచరికాన్నే వదులుకుంటోంది జపాన్ యువరాణి మకో. వివరాల్లోకి వెళ్తే, జపాన్ రాజు అకిటో చిన్న మనుమరాలైన మకో కాలేజీలో తన సహ విద్యార్థి అయిన కియో కొమురోను ప్రేమించింది. 2012లో ఓ రెస్టారెంటులో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. జపాన్ చట్టం ప్రకారం రాచకుటుంబంలోని వ్యక్తులెవరైనా సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే... వారు రాజకుటుంబాన్ని వదిలి వెళ్లిపోవాలి. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లను చేస్తున్నట్టు జపాన్ రాజకుటుంబం స్థానిక మీడియాకు తెలిపింది. త్వరలోనే ఓ బహిరంగ ప్రకటన ద్వారా వివాహ తేదీని వెల్లడించనున్నారు. అధికారికంగానే వీరి ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. పెళ్లి అయిన తర్వాత తన భర్తతో కలసి ఆమె వెళ్లిపోవాల్సి ఉంటుంది.

గతంలో కూడా మకో మేనత్త, రాజు అకిటోకు ఏకైక కుమార్తె సెయాకో ఓ సాధారణ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జపాన్ రాజకుటుంబంలో ఇలాంటి పెళ్లి జరగడం అదే తొలిసారి. టోక్యో అర్బన్ ప్లానర్ గా పనిచేస్తున్న వ్యక్తిని ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం రాజకుటుంబాన్ని వదిలి... ఆమె సింగిల్ బెండ్ రూమ్ లో సర్దుకుని జీవిస్తున్నారు. షాపింగ్ చేయడం, కారు డ్రైవ్ చేయడం లాంటి విషయాలన్నింటినీ ఆమె పెళ్లి తర్వాతే నేర్చుకున్నారు. 

More Telugu News