: 777888999 నుంచి ఫోన్ వస్తే... లిఫ్ట్ చేస్తే పేలిపోతుందా? చచ్చిపోతారా?: 'నెట్టింట' ప్రచారంపై అసలు వాస్తవమిది!

"అర్జంట్... దయచేసి 777888999 నంబర్ నుంచి కాల్ వస్తే దాన్ని లిఫ్ట్ చేయకండి. ఒకవేళ మీరు కాల్ రిసీవ్ చేసుకుంటే, మీ ఫోన్ పేలిపోతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ కు కూడా దీన్ని షేర్ చేయండి"

"777888999 నుంచి కాల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటే, ఓ యువతి మాట్లాడుతుంది. అదే మీరు మాట్లాడే చివరి కాల్ అని చెబుతుంది. ఆపై నిజంగానే అలా జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. అశ్రద్ధ చేయవద్దు. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని షేర్ చేయండి"

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా వాట్స్ యాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ ఖాతాల్లో కనిపిస్తున్న మెసేజ్ ఇది. ఈ నంబర్ నుంచి కాల్ వస్తే... ఫోన్ పేలిపోతుందా? రిసీవ్ చేసుకున్న వారు నిజంగానే మరణిస్తారా? అంటూ నెట్టింట తీవ్రమైన చర్చే జరుగుతోంది.

అయితే, ఇది కేవలం పుకారేనని నిపుణులు కొట్టి పారేస్తున్నారు. ఈ తరహా ప్రచారాన్ని ఎంతమాత్రమూ నమ్మక్కర్లేదని అంటున్నారు. ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చి, దాన్ని రిసీవ్ చేస్తే, ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉండదని, అటువంటిదే ఉంటే, అది అన్ని నంబర్లకూ వర్తిస్తుందని చెబుతున్నారు. ఇక ఫోన్ రిసీవ్ చేసుకుంటే చనిపోతారనడానికి ఒక్క నిదర్శనం కూడా లేదని చెబుతున్నారు. ఈ నంబరులో కేవలం 9 అంకెలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది ఇండియాలో పనిచేయదని, ఒకవేళ అది ఇంటర్నేషనల్ నంబరే అయినా, ఆ దేశపు కోడ్ సహా మొబైల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందని అభయమిస్తున్నారు. ఈ నంబరుతో ఫోన్ వచ్చినట్టు ఇంతవరకూ సాక్ష్యాలు లభించలేదని టెలికం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ తరహా ప్రచారాన్ని నమ్మి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు.

More Telugu News