: పాక్ తో ఫైట్ కు గెట్ రెడీ: సైన్యానికి జైట్లీ సూచన

సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే, దీటైన జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సైన్యానికి సూచించారు. నియంత్రణ రేఖ వద్ద పొరుగుదేశం ఆగడాలు ఇటీవలి కాలంలో పెరగడం, కాశ్మీరులో యువత నిరసనలు కొనసాగుతూ ఉండటంపై భద్రతపై శ్రీనగర్ లో జరిగిన ఓ సమావేశంలో జైట్లీ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ శాఖ కార్యదర్శి అమిత్ మిశ్రా, సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

నియంత్రణ రేఖ వద్ద పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను ఏ విధంగా తిప్పికొడుతున్నామన్న అంశాన్ని జైట్లీకి వివరించారు. కాశ్మీర్ లోని పరిస్థితులను కూడా ఆయనకు వివరించారు. ఆపై జైట్లీ మాట్లాడుతూ, నియంత్రణ రేఖ వద్ద పహారా కాస్తున్న సైనికులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాక్ కవ్వింపులు చూస్తూ, వేచి చూసే ధోరణిలో ఉండక్కర్లేదని సరైన గుణపాఠం చెబుతూ ఉండాలని ఆదేశించారు. పాక్ తో ఫైట్ కు ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించారు. కాశ్మీర్ లోని దుష్టశక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించిన ఆయన, ఈ క్రమంలో అమాయకులకు ఎలాంటి ముప్పూ తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. జాతి భద్రత కోసం ఎన్నో సవాళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికుల త్యాగాన్ని, దేశభక్తిని ప్రజలెన్నటికీ మరువబోరని జైట్లీ అన్నారు.

More Telugu News