: పుట్టింటి నుంచి డబ్బులు తెస్తే ఓకే... లేకపోతే భార్య, మరదలు, అత్త వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటున్న కీచకుడు

హైదరాబాదు సైబర్ క్రైం పోలీసుల ముందుకు డబ్బుకోసం పూర్తిగా దిగజారిన భర్తకు సంబంధించిన కేసు ఒకటి వచ్చింది. దీని వివరాలు విని ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడని సీహెచ్ ప్రవీణ్ అనే వ్యక్తికి తమ కూతుర్ని ఇచ్చి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన తల్లిదండ్రులు 2016 ఫిబ్రవరి 28న ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం విదేశాల నుంచి వచ్చేసి అత్తారింట్లో తిష్ట వేసిన ప్రవీణ్‌... తన అత్తగారి ఇంట్లో తమకు కేటాయించిన గదితో పాటు, భార్య సోదరి, అత్త గదులలో సీసీ కెమెరాలను ఎవరికీ తెలియకుండా బిగించాడు.

వీటి ద్వారా తన భార్యతో గడిపిన ఏకాంతపు దృశ్యాలతో పాటు ఆమె సోదరి, అత్తలకు సంబంధించిన వీడియోలను కూడా రికార్డు చేశాడు. అతని దుర్బుద్ధిని గుర్తించిన అత్తారింటి వాళ్లు అతనిని దూరం పెట్టగా, పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురావాలంటూ భార్యపై వేధింపులకు దిగాడు. దీనికి ఆమె నిరాకరించడంతో సీసీ కెమెరాలతో తాను రికార్డు చేసిన వీడియోలను భార్యకు చూపించి, డబ్బు తీసుకురావాలని, లేని పక్షంలో...ఆ వీడియోలను అశ్లీల వెబ్‌ సైట్‌ లకు విక్రయించడంతో పాటు, సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగుతున్నాడు. అతని వేధింపులు తాళలేని భార్య సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News