: చైనాలో జరిగిన ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ సమావేశంలో భారత్‌ను కొనియాడిన చైనా సంపన్నుడు

చైనాలో నిర్వ‌హించిన‌ ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ సమావేశానికి భార‌త్ హాజ‌రుకాని విష‌యం తెలిసిందే. ఇందులో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా స‌హా మొత్తం 29 దేశాల నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ స‌మావేశానికి భార‌త్ హాజ‌రుకాక‌పోయిన‌ప్ప‌టికీ ఆ వేదిక‌పై మాత్రం భార‌త్‌కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అది కూడా చైనా సంపన్నుడి నోటి నుంచే. వాండా గ్రూప్ అధిపతి వాంగ్ జియాన్లిన్ ఈ స‌మావేశంలో ప్ర‌సంగిస్తూ భారతదేశ ఆర్థిక శక్తిని కొనియాడారు. ఇండియాలో త‌న గ్రూప్ కంపెనీలు చేపట్టబోతున్న కార్యకలాపాలను కూడా వివరించారు.

చైనా నిర్మిస్తోన్న‌ ‘బెల్ట్ అండ్ రోడ్’ వెంబడి అభివృద్ధి చెందుతున్న, అత్యధిక జనాభాగల దేశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. భార‌త్‌లో 130 కోట్ల జ‌నాభా ఉంద‌ని, ఇండియ‌న్ల సగటు వయసు 26 సంవత్సరాలని అన్నారు. 26 కోట్ల జనాభాగల ఇండోనేషియా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. ఆ దేశంలోనూ యువ‌త ఎక్కువేన‌ని చెప్పారు. త‌మ గ్రూప్ కంపెనీలు ప్ర‌ధానంగా ఆయా దేశాల్లో రియల్ ఎస్టేట్, డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, ఫిలిం ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెడతాయని చెప్పారు. తన గ్రూపు భారతదేశంలో కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.

 పర్యాటక మౌలిక సదుపాయాల్లో భార‌త్‌, ఇండోనేషియా దేశాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఈ దేశాలు ఉత్తమ అవకాశాలను కల్పిస్తున్నాయని, తాము ఇండియాలో ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో వాండా ఇండస్ట్రియల్ న్యూ సిటీని చేపట్టామని తెలిపారు. అందులో మాన్యుఫాక్చరింగ్ పార్క్, సాంస్కృతిక పర్యాటక పార్క్, నివాస ప్రాంతం ఉంటాయని, ఈ ప్రాజెక్టు పూర్త‌య్యాక దాదాపు ల‌క్ష‌మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని అన్నారు. ఇండియాలోని ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో ఇదే పెద్దదని తెలిపారు. ఇండియా ఆర్థికంగా బ‌లంగా ఉంద‌ని అన్నారు.

More Telugu News