: నాగబాబు, రోజా, రవి, శ్రీముఖి వెంటనే 'జబర్దస్త్', 'పటాస్' షోల నుంచి తప్పుకోవాలి: సెన్సార్ బోర్టు సభ్యుడు నందనం దివాకర్

ఈనాడు టెలివిజన్ చానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలు యువతను పక్కదారి పట్టిస్తున్నాయని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్, జబర్దస్త్ కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, పటాస్ యాంకర్లు శ్రీముఖి, రవిలపై విరుచుకుపడ్డారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, వెంటనే వారంతా ఈ షోల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రవి, శ్రీముఖి చిలిపి చేష్టల వల్ల యువతలో తప్పు చేయాలన్న అభిప్రాయం కలుగుతోందని ఆరోపించారు.

ఈ షోలను ప్రజలు ఆదరిస్తున్నారని భావించడం తప్పని, ఇళ్లలో వీటిని కుటుంబ సమేతంగా చూడలేక ఎంతో మంది బాధపడుతున్నారని అన్నారు. ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న రోజా, బాధ్యతగల పౌరుడిగా నాగబాబు వెంటనే జబర్దస్త్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలపై తాము ఈటీవీ యాజమాన్యానికి విజ్ఞప్తులు పంపినా వారి నుంచి స్పందన రాలేదని, ఈ ప్రోగ్రామ్ లను ఆపేంతవరకూ తమ పోరు సాగుతుందని అన్నారు. ఓ మహిళగా ఉన్న రోజా, మహిళలను అవమానించే స్కిట్లను చూసి ఆనందిస్తూ, వాటిపై తీర్పు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పటాస్ లో యాంకర్లు అందరిముందూ లిప్ లాక్ చేసుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇది యువతను రెచ్చగొట్టి పెడదారి పట్టించే చర్యేనని, దీనిపై వారికి శిక్ష పడేంత వరకూ పోరాడుతానని అన్నారు.

More Telugu News