: సెల్‌ఫోన్‌లో రెండు నెలలుగా 25 మంది మహిళలకు వేధింపులు.. చివరికి పోలీసులకు చిక్కిన నిందితుడు

అతడో తాపీమేస్త్రీ. కానీ చేసే పనిమాత్రం ప్రాంతాలతో సంబంధం లేకుండా మహిళలను వేధించడం. ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడం. ఎట్టకేలకు అతడి ఆగడాలకు పోలీసులు చెక్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు సమీపంలోని మర్రిపాడుకు చెందిన షేక్ అలీ తాపీమేస్త్రీ. సమయం, ప్రాంతాలతో సంబంధం లేకుండా మహిళలను వేధించడం ఇతడి ప్రవృత్తి. నెల్లూరు నుంచి కానూరు వరకు రెండు నెలలుగా ఇతగాడి వేధింపుల పర్వం కొనసాగింది. 25 మంది మహిళలు బాధితుల లిస్ట్‌లో ఉన్నారు. ఇటీవల మహిళలకు తరచూ ఫోన్ చేసి దూషించడం, తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు.

ఇటీవల కానూరుకు చెందిన బ్యూటీషియన్‌కు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఓ నంబరుపై అనుమానం వచ్చి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. బ్యూటీషియన్‌కు వచ్చిన ఫోన్‌ నంబరు ఆధారంగా అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఓ మహిళ కనిపించింది. నిందితుడికి ఆమెతో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మంగళవారం పోలీసులు షేక్ అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్‌ను చూసిన పోలీసులు నివ్వెరపోయారు. నెల్లూరు, విజయవాడ, అనంతపురం, కోదాడకు చెందిన పలువురు మహిళలకు అతడి ఫోన్ నుంచి కాల్స్ వెళ్లాయి. ఒక్క కానూరులోనే ఆరుగురు మహిళలు అతడి బారిన పడ్డారు. నిందితుడిని కటకటాల వెనక్కి పంపిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News