: 'వాన్నా క్రై' ర్యాన్సమ్ వేర్ కారణంగా భారత్ లో పెద్దగా ప్రభావం లేదు: కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్

ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ ప్రయోగించిన ర్యాన్సమ్ వేర్ 'వాన్నా క్రై' ప్రపంచాన్ని ఏడిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని ప్రభావం నుంచి భారత్ సురక్షితంగా బయటపడిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భారత ప్రభుత్వం సైబర్‌ దాడుల నుంచి రక్షణ కోసం గత మార్చి నుంచే ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించిందని అన్నారు. అందువల్లే భారత్ పై ఈ సైబర్ దాడి పెద్దగా ప్రభావం చూపలేదని ఆయన చెప్పారు.

ఈ దాడిలో ఆంధ్రప్రదేశ పోలీసు విభాగానికి చెందిన 18 కంప్యూటర్లతో పాటు కేరళలోని వాయ్‌ నాడ్‌ పంచాయతీ శాఖకు చెందిన కొన్ని కంప్యూటర్లు, ఇంకా పాలక్కాడ్‌ రైల్వే కార్యాలయంలో 23 కంప్యూటర్లు, పశ్చిమబెంగాల్‌ లోని విద్యుత డిస్కమ్‌ కార్యాలయాల్లోని కొన్ని కంప్యూటర్లు, గుజరాత్ లోని 150 కంప్యూటర్లు హ్యాకింగ్ బారినపడ్డాయని, వీటి మినహా ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మరో ఐదు ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు.

ముందు జాగ్రత్తగా వాన్నా క్రై ను అడ్డుకునే సాఫ్ట్ వేర్ ను అప్ లోడ్ చేసిన అనంతరం ఏటీఎం సేవలు ప్రారంభించాలని, విండోస్ ఎక్స్ పీ వాడుతున్న ఏటీఎంలలో దానిని వెంటనే అప్ గ్రేడ్ చేయాలని ఆర్బీఐ సూచించిందని ఆయన చెప్పారు. ఇంతకు మించి భారత్ కు దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆయన స్పష్టం చేశారు. 

More Telugu News