: నల్ల కుబేరులపై చర్యలకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ వెబ్ సైట్ ప్రారంభం

పన్ను ఎగవేతదారులు, నల్లధన కుబేరులపై చర్యలు చేపట్టేందుకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో ఓ వెబ్ సైట్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్ను ఎగవేతదారుల వివరాలను దశల వారీగా ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని అన్నారు. క్రమం తప్పకుండా పన్ను కట్టే వారికి, ఎగవేతదారులకు మధ్య వ్యత్యాసం తెలియజెప్పేందుకే ఈ వెబ్ సైట్ ను ప్రారంభించామన్నారు.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఎప్పుడెప్పుడు ఎవరెవరిపై దాడులు చేస్తున్నారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో ఉంచామన్నారు. పన్ను ఎగవేతదారులపై అధిక, మధ్యరకం, తక్కువ, అతితక్కువ రిస్క్ పేరిట నాలుగు రకాలుగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అధికంగా పన్ను ఎగవేతకు పాల్పడిన వ్యక్తుల లేదా సంస్థలపై సోదాలు నిర్వహించడం, ప్రత్యక్ష విచారణ చేయడం, నగలు, నగదు, ఆస్తులను సీజ్ చేయడం వంటి చర్యలు చేపడతామన్నారు. మధ్యరకం పన్నుఎగవేతదారులకు ఎస్ఎంఎస్ లు, ఈ-మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడం, తక్కువ, అతితక్కువ పన్ను ఎగవేతదారులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.

More Telugu News