: నిజంగా లక్షలాది మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనా?: నిపుణులేమంటున్నారంటే..!

తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయం గడచిన కొన్ని వారాలుగా భారత ఐటీ నిపుణులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. వచ్చే రెండేళ్లలో దాదాపు 6 లక్షల మంది వరకూ ఉద్యోగాలను కోల్పోనున్నారని వచ్చిన వార్తలు ఐటీ రంగాన్ని కలవరపెడుతున్న వేళ, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ వంటివి వాటిని ఖండిస్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఉద్యోగాల్లో కోతనే సూచిస్తున్నాయి. 2008 నాటి ఆర్థిక మాంద్యం తరువాత, అత్యంత ఘోరంగా ఐటీ కంపెనీలు పతనం వైపు కదులుతున్న వేళ, గడచిన మూడు నెలల్లో దిగ్గజ ఐటీ సంస్థలతో పాటు ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి. హెడ్ హంటర్స్ వంటి సంస్థలు ఐటీ సెక్టారులో ఏడాదికి 1.75 నుంచి 2 లక్షల వరకూ ఉద్యోగులు ఇంటి దారి పట్టనున్నారని నివేదికను విడుదల చేశాయి.

చేతికందుతున్న అధునాతన సాంకేతికత, పెరుగుతున్న ఆటోమేషన్ తో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకే కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. కాగా, ఉద్యోగాల కోత అనుకున్నంత ఎక్కువగా ఉండక పోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నోమురా, తాజాగా ఓ రీసెర్చ్ నోట్ ను విడుదల చేస్తూ, ఐటీ రంగంలోని ఇన్ఫోసిస్, కాగ్నిజంట్, టెక్ మహీంద్రా, విప్రో తదితర సంస్థల్లో 7.60 లక్షల మంది ఉపాధిని పొందుతుండగా, కేవలం 2 నుంచి 3 శాతం వరకు మాత్రమే ఉద్యోగాలను కోల్పోతారని పేర్కొంది. అంటే, 22 వేల మంది మాత్రమే కత్తిపై వేలాడుతున్నట్టు. గడచిన కొద్ది సంవత్సరాల్లో సాలీనా 1 నుంచి 1.5 శాతం వరకూ ఉద్యోగాల్లో కోత పడుతూ వచ్చిందని, ఈ సంవత్సరం అదనంగా దాదాపు 7 వేల మంది వరకూ ఉద్యోగాలు కోల్పోవచ్చని నోమురా అంచనా వేస్తోంది.

విప్రోలో పనితీరు బాగాలేదన్న కారణాలను చూపుతూ 600 మందిని తొలగించగా, కాగ్నిజంట్ మొత్తం ఉద్యోగుల్లో 2.3 శాతం మందిని... అంటే దాదాపు 6 వేల మందిని తొలగించింది. మరో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సుమారు 1000 మందిని రాజీనామా కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐటీ కంపెనీల్లో కొత్తగా చేరుతున్న ఉద్యోగులు, నాణ్యతకు తగ్గ పనితీరును కనబరచక పోవడం కూడా వారి తొలగింపునకు కారణమవుతోందని, వస్తున్న అంచనాలకు తగ్గట్టుగా ఉద్యోగాల కోత ఉండబోదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అంచనా వేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం ప్రభావంతో ఇన్ఫోసిస్ వచ్చే ఏడాదిలో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించవచ్చని పేర్కొన్నారు. భారీ స్థాయిలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన అక్కర్లేదని వెల్లడించారు.

More Telugu News