: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీలోని ఆ పేజీలు మాయం.. గుర్తించిన సిట్!

గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అల్కాపురిలోని ఆయన నివాసం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలోని కొన్ని కీలక పేజీలు మాయమైనట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన ఈ డైరీలోని కొన్ని పేజీలు మాయం కావడాన్ని సిట్ సీరియస్‌గా తీసుకుంది. అసలు ఆ పేజీలు ఎలా మాయమయ్యాయి? ఎవరి ఆదేశాల మేరకు వాటిని మాయం చేశారు? అన్న దానిపై దృష్టిసారించింది.

మాయమైన పేజీల్లో పోలీసు అధికారులు, పలు పార్టీల నేతలకు సంబంధించిన విషయాలు ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నయీం డైరీలో కొన్ని పేజీలు పూర్తిగా మాయం కాగా, కొన్ని కీలక ఆధారాలు కనిపించకుండా పోయినట్టు సిట్ గుర్తించింది. కాగా, నయీంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నేతలకు సంబంధించిన ఆధారాలను, వారిపై ఉన్న అభియోగాలకు సంబంధించిన నివేదికను సిట్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి అందించిన నివేదికలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, భవనగిరికి చెందిన ఇద్దరు స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News