: రేపు అసెంబ్లీని అడ్డుకుంటాం.. రైతుల స‌మ‌స్య‌ల‌పై గ‌ళం ఎత్తుతాం!: వైఎస్ జ‌గ‌న్

జీఎస్‌టీ స‌వ‌ర‌ణ‌ బిల్లుకు ఆమోదం తెలిపే క్ర‌మంలో రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం జర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, రేప‌టి అసెంబ్లీని అడ్డుకుంటామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. రైతుల స‌మ‌స్యలు తీర్చ‌కుండా చంద్ర‌బాబు నాయుడు కాల‌యాప‌న చేస్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. రైతుల‌ను మోసం చేయ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నిక‌ల స‌మ‌యంలో రుణ‌మాఫీ ర‌ద్దు అని చంద్ర‌బాబు నాయుడు మోస‌పూరిత మాట‌లు చెప్పారని అన్నారు.

ఇప్పుడు కూడా అటువంటి మాట‌లే చెబుతూ మ‌భ్య‌పెడుతున్నారని ఆరోపించారు. మిర్చి ఈ ఏడాది క‌నీసం 4 వేల రూపాయ‌లు కూడా ప‌ల‌క‌డం లేదని జ‌గ‌న్ అన్నారు. రైతుల ఆదాయం గురించి ప్ర‌భుత్వం ఆలోచించ‌డం లేదని, ఉల్లి, మిర్చి, ప‌సుపు, టొమాటో.. ఏ పంట చూసుకున్నా రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదని ఆయ‌న అన్నారు. రైతుల‌కు ముష్టి వేసిన‌ట్లు న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు సిగ్గుతో త‌ల‌వంచుకోవాల‌ని ఆయ‌న అన్నారు. తాము రైతుల‌కు అండ‌గా నిలిచే దిశ‌గా అడుగులు ముందుకు వేస్తున్నామ‌ని చెప్పారు. చంద్ర‌బాబు నాయుడు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని అన్నారు. ద‌ళారులు, వ్యాపారులు రైతుల జీవితాల‌తో ఆడుకుంటున్నారని అన్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై రేపు గ‌ళం ఎత్తుతామ‌ని చెప్పారు. రైతుల‌కు గిట్టు బాటు ధ‌ర ఇవ్వాల్సిందేన‌ని ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇస్తున్నామ‌ని తెలిపారు.

More Telugu News