: ‘పరుగు’తో ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు!

ఆరోగ్యం కోసం పెట్టే పరుగుతో ఎన్నో ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా, బరువు తగ్గాలనుకున్నా, కెలోరీలు కరగాలన్నా, కండరాలు దృఢంగా ఉండాలన్నా ‘పరుగు’ ప్రారంభించాల్సిందే. బరువు తగ్గడానికి పరుగెత్తడానికి ఉన్న ‘లింక్’ ఏంటంటే.. పరుగెత్తడం వల్ల శరీరంలో ఉండే అధిక కెలోరీలు కరిగి తద్వారా కొవ్వు కరగడంతో బరువు తగ్గుతాము. అయితే, మెల్లిగా పరిగెత్తడం కన్నా వేగంగా పరిగెత్తేవారిలో కెలోరీలు తొందరగా కరుగుతాయి. పరుగెత్తడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన చర్మం కూడా సొంతమవుతుంది.

రక్తప్రసరణ సక్రమంగా జరగడం వల్ల మనం తీసుకునే పోషకాలన్నీ, శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. కండరాలు దృఢంగా మారడంతో పాటూ, కాళ్లూ, శరీరాకృతి తీరైన ఆకృతిలో ఉంటుంది. ముఖ్యంగా, పరుగెత్తడం ద్వారా మహిళలు రొమ్ము, గర్భాశయ కేన్సర్ల బారిన పడకుండా  ఉంటారని, ఆ వ్యాధులు దరి చేరే ప్రమాదం యాభై శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, పరుగెత్తడం మంచిదే కానీ, అందుకు ఉపక్రమించే ముందు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ధరించే దుస్తులు, బూట్లపై శ్రద్ధ పెట్టాలి. కాళ్లకు సరిపోయే షూను మాత్రమే ధరించాలి.

More Telugu News