: ఆంధ్రజ్యోతిని బహిష్కరిస్తున్నాం.. ఆ పత్రిక విలేకరులు రానక్కరలేదు: భూమన

ఒక పార్టీని, ఒక నాయకుడిని సర్వ నాశనం చేయాలన్న దురుద్దేశంతో ఆంధ్రజ్యోతి పత్రిక వ్యవహరిస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ జెండాను భుజాన మోస్తూ... తప్పుడు వార్తలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని అన్నారు. ప్రజా సమస్యల గురించే ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యారని... అయితే జగన్ పై బుదరదజల్లే విధంగా ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు.

మోదీకి జగన్ ఇచ్చిన వినతి పత్రంపై లేనిది ఉన్నట్టుగా చూపించేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందని భూమని విమర్శించారు. పత్రికా విలువలను ఆంధ్రజ్యోతి పూర్తిగా వదిలేసిందని అన్నారు. జగన్ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు వార్త రాసిన జ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ కు లేఖ రాస్తామని చెప్పారు. పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. గత మూడేళ్లుగా జగన్ పై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు విషం కక్కుతున్నాయని అన్నారు.

ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికను గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల వరకు వైసీపీ బహిష్కరిస్తోందని భూమన తెలిపారు. తమ పార్టీ కార్యాలయాలకు కూడా ఆ పత్రిక విలేకరులు రావాల్సిన అవసరం లేదని అన్నారు. 

More Telugu News